టి.సర్కారు జీఓ జారీ
హైదరాబాద్, ఆగస్టు 13 (జనంసాక్షి) : 2014 మార్చి 31వరకు ఉన్న లక్షలోపు వ్యవసాయ రుణాలు రద్దుచేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీ జీఓను బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసింది. రైతు రుణమాఫీ మార్గదర్శకాలతో కూడిన జీఓ నెం.69ను ప్రభుత్వం తరపున తెలంగాణ వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున రుణమాఫీ వర్తింపు ఉంటుందని, స్వల్పకాలిక, వ్యవసాయ బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణాల మాఫీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని, బ్యాంకులు తక్షణమే రైతులకు కొత్త రుణాలివ్వాలని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల హామీలను పకడ్బందీగా అమలుచేస్తున్న ప్రభుత్వం రుణమాఫీపై జీఓ విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని పక్కనే పెట్టే ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగాయి. వాటికి భిన్నంగా ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.





