Monday, 2 November 2026

జయ జైలుకు

Untitled-3తమిళనాడు సీఎంకు నాలుగేళ్ల శిక్ష

రూ.100కోట్ల జరిమానా

ఎమ్మెల్యేకు అనర్హత

రాజీనామా చేయాల్సిందే

జైలుకు తరలించేందుకు సన్నాహాలు

బెంగుళూరు ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు

బెంగళూరు, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ళు జైలుశిక్ష ఖరారైంది. రూ.100కోట్ల జరిమానాతోపాటు ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటుపడింది. ఇక ఆమె రాజీనామా చేయాల్సిందే. జయను జైలుకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. శనివారం బెంగుళూరు ప్రత్యేక న్యాయస్థానం ఈ సంచలన తీర్పు ఇచ్చింది. దేశచరిత్రలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండగా జైలుకు వెళ్లబోతున్నారు. అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆమెతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. మొత్తం దోషులు నలుగురికి కలిపి వందకోట్ల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని దోషులు ఒక్కొక్కరు రూ.25కోట్లు చొప్పున చెల్లించాలి. తమిళనాడు రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన తీర్పుగా దీనిని పేర్కొనవచ్చు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమె పదవి కోల్పోనున్నారు. ఆమె తరవాత ఎవరన్నది ఇప్పుడ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు తీర్పు కారణంగా తమిళనాట గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థరించింది. మధ్యాహ్నం తర్వాత ప్రత్యేక కోర్టు జయలలితకు శిక్షను ఖరారు చేయనుందని ప్రకటించారు. దాదాపు 18ఏళ్లపాటు సాగిన కేసు విచారణలో 14మంది జడ్జిల సమక్షంలో విచారణ జరిగింది. 259మంది ప్రాసిక్యూషన్‌ సాక్షులు, 99 మంది డిఫెన్స్‌ సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు ఆవరణలోని ప్రత్యేక కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కోర్టు వద్దకు ఏఐఏడీఎంకే కార్యకర్తలు వేలాదిగా చేరుకున్నారు. ముందుగా దోషిగా తేల్చిన తరవాత సాయంత్రం ఆమెకు శిక్ష ఖరారుచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 1996లో జయలలితపై కేసు నమోదైంది. జయలలితతోపాటు ఆమెకి అత్యంత సన్నిహితురాలైన శశికళ, ఆమె కుమారుడు సుధాకర్‌, బంధువు ఇళవరసి కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో జయలలిత ఇంట్లో జరిపిన సోదాల్లో 880కిలోల వెండి, 28కిలోల బంగారం, 10వేలకుపైగా చీరలు, 90కిపైగా వాచీలు, 750జతల పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అనేక చోట్ల జయలలిత ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలొచ్చాయి. కేవలం ఒక్కరూపాయి వేతనం తీసుకుని ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారని అభియోగం నమోదైంది. జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని న్యాయమూర్తి స్వయంగా పరిశీలించారు. దీనిపై 2011లో జయలలిత స్వయంగా కోర్టుకెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ తొలుత చెన్నైలోనే జరిగినా… మళ్లీ జయలలిత సీఎం కావడంతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తారని డీఎంకే పిటిషన్‌ దాఖలుచేసింది. డీఎంకే పిటిషన్‌తో జయలలిత కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి మారింది.

హైకోర్టులో అప్పీల్‌ చేయనున్న జయ

బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైకోర్టుకు అప్పీలు చేయనున్నారు. ఈ మేరకు ఆమె న్యాయవాదులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముందుగా ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్దరించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రత్యేక న్యాయస్థానం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు పరిసరాల్లోని 5కిలోవిూటర్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించారు.  అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను బెంగళూరు న్యాయస్థానం దోషిగా తేల్చడంతో ఆమె అన్నాడీఎంకే కార్యకర్తలు కాంచీపురంలో ఒక బస్సుకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో నలుగురు గాయపడ్డారు. కడలూరు జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు 20 బస్సులను ధ్వంసం చేశారు.

సీఎం పదవి నుంచి జైలుకు..!

రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న జయ ఇక జైలులో అడుగుపెట్టనుంది. శిక్షఖరారు కావడంతో ఆమెను జైలుకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. పోలీసులు ఇందుకు రంగం సిద్ధంచేశారు. ఆమెను తమిళనాడుకు కాకుండా బెంగుళూరులోనే ఉంచుతారా లేక మరెక్కడికైనా తరలిస్తారా అన్నది చూడాలి.పదవిలో ఉన్నప్పుడు నెలకు ఒక రూపాయి జీతం తీసుకున్న ఆమె రూ.66 కోట్లు ఎలా సంపాదించారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఇందుకు ప్రతిస్పందించిన జయ.. ఒక సినీ నటిగా సంపాదించానని, అక్రమాలకు పాల్పడలేదని ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విచారణలో భాగంగా జయను చెన్నై న్యాయస్థానం 1,300 ప్రశ్నలను అడిగింది. తమిళనాడు రాష్ట్ర చరిత్రలో జయలలితది ప్రత్యేక స్థానం. సినీ రంగంలో జయకు ఎవరూ సాటిరారు. తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రిగా జయ పగ్గాలు చేపట్టడం విశేషం. 43వ ఏటనే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జయ. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు సీఎం జయలలిత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొది. ఎన్నో ఉత్తానపతనాలను చవిచూసింది. అటు సినిమాల్లోను, ఇటు రాజకీయాల్లోనూ ఆమెకు ఎన్నో కష్టనష్టాలు ఎదురయ్యయి. అన్నింటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కంటూ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఓ సాధారణ సినిమా హీరోయిన్‌ స్థాయి నుంచి తమిళనాడు సీఎంగా ఎదిగారు. 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. 1977లో ఎంజీ రామ్చంద్రన్‌ తమిళనాడుకు మఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచండుర్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. 1984లో జయ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. 1987లో రామచంద్రన్‌ మరణించడంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్‌ భార్య జానకీ రామచంద్రన్‌ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత సారథ్యం వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు జానకికి మద్దతు ప్రకటించడంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు ముందు తమిళనాడులో అప్పటి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య జరగింది. ఆ సానుభూతి దేశమంత పనిచేసి కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. అప్పటి ఎన్నికల్లో తమిళనాట ఏఐడీఎంకే మొత్తం 234 స్థానాలకు 225 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడుకు జయ మొట్టమొదటి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే ఎడాది ఆమె ఆదాయానికి మించిని ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఏఐడీఎంకే కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. దీంతో కరుణానిధి పార్టీ డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కరుణానిధి జయ అక్రమాస్తుల కేసుపై దృష్టి పెట్టారు. అమెపై దాదాపు 9 కేసులు నమోదయ్యయి. ఇందులో ఏడు కేసుల నుంచి జయ నిర్దోషిగా బయట్టారు.

2001లో మళ్లీ జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకుని ఆ స్థానంలో మంత్రివర్గంలోని పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించింది. అనంతరం 2006లో మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2011లో ముచ్చటగా మూడోసారి జయ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1964లో జయ తెలుగు సినిమాలోకి అడుగు పెట్టింది. మనషులు మమతలు ఆమె మొదటి తెలుగు సినిమా. అలా ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 140 చిత్రాలలో నటించారు. ఆమె జాతీయ అవార్డ్‌ తోపాటు పలు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *