కోటి ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చిండు
సమైక్య ముసుగులో భూ కబ్జాలు
హైదరాబాద్‌లో ల్యాండ్ మాఫియా రాజ్యమేలింది
సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (జనంసాక్షి) : దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఏర్పాటుచేసిన ఏకైక రాజు నిజాం నవాబు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కోటి ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజలకు ఇచ్చిండన్నారు. అయితే సమైక్య రాష్ట్రం ముసుగులో భూ కబ్జాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. గతంలో హైదరాబాద్‌లో ల్యాండ్ మాఫియా రాజ్యమేలిందన్నారు. కబ్జాకోరులు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల వేల ఎకరాలను కబ్జాచేశారని సీఎం అన్నారు. వీరందరినీ తరిమి కొడతామని అన్నారు. న్యాయవ్యవస్థపై తెలంగాణ ప్రజలకు గౌరవముందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన సిటీకోర్టు 150 వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. సమైక్య ముసుగులో అనేకమంది కబ్జారాయుళ్లు పుట్టుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నకిలీ ధ్రువపత్రాలు ఎక్కువగా తయారు చేస్తున్నారన్నారు. నిజాం కోటి ఎకరాల భూమి అప్పజెప్పారని ఆయన తెలిపారు. అవన్నీ అన్యాక్రాంతం అయ్యాయన్నారు. ఇప్పటికీ సాగు యోగ్యతలేని 30లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం వద్ద ఉందన్నారు. త్వరలో చంచల్‌గూడ జైలు, ప్రింటింగ్ ప్రెస్‌లను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చంచల్‌గూడ జైలును కూడా చర్లపల్లి జైలుకు తరలిస్తామని చెప్పారు. వాటి ప్రదేశంలో ఎక్కడో ఒక చోట విశాలమైన కోర్టు కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. త్వరలోనే న్యాయవాదుల ఫేర్‌వెల్ ఫండ్స్ రిలీజ్‌చేస్తామని తెలిపారు. న్యాయవాదులకు హెల్త్‌కార్డుల గురించి పరిశీలిస్తామన్నారు. వీలైనంత త్వరగా తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. హైదరాబాద్‌లో చాలా ల్యాండ్ మాఫియాలున్నాయని వాటిని తరిమి కొడతామని పేర్కొన్నారు. ఈఎన్‌టీ ఆసుపత్రి భూమిని కూడా కబ్జా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల 30లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని తెలిపారు.





