Monday, 2 November 2026

ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రోళ్ల విగ్రహాలెందుకు?

kcr-2భద్రంగా ఆంధ్రాకు పంపిస్తాం

ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాలకు చోటు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

బాపూజీ పేరు విూద మెమోరియల్‌ ఏర్పాటు:సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రోళ్ల విగ్రహాలు మనకెందుకని, వాటిని భద్రంగా ఆంధ్రాకు పంపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాలకు అక్కడ చోటు కల్పిస్తామని చెప్పారు. బాపూజీ పేరుమీద మెమోరియల్‌ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. శనివారం నారాయణగూడ పద్మశాలి భవన్‌ ఎదుట కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమానిన బతికించింది ఇద్దరే ఇద్దరేనన్నారు. వారిలో ఒకరు ప్రొ.జయశంకర్‌ సార్‌, మరొకరు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయినా తనకు ఉద్యమ సోయి పోలేదని.. జలదృశ్యంలో బాపూజీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేట్టు చేస్తనని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమంపై సమైక్య సర్కార్‌ విధించిన ఎన్నో నిర్బంధాలనెదుర్కొన్న ధీశాలి కొండా లక్ష్మణ్‌ బాపూజీయేనని సీఎం అన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న వ్యక్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీయని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి బాపూజీ అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు బాపూజీ నివసించిన జలదృశ్యమే తొలి వేదిక అన్నారు. 1996లో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయన ఊపిరిపోశారన్నారు. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌, తెలంగాణ పీపుల్స్‌ పార్టీలను స్థాపించి ప్రత్యేక రాష్ట్రకాంక్ష చాటారన్నారు. జీవిత మలిసంధ్యలోనూ ఎక్కడ తెలంగాణ టెంటు వెలిస్తే అక్కడ ప్రత్యక్షమవుతూ విద్యార్థి, యువజనులకు స్ఫూర్తినిచ్చారన్నారు. తెలుగు నేలపై పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన తొలి నాయకుడు బాపూజీ అన్నారు. ప్రజల వద్దకు పాలన నినాదమూ ఆయనదేనన్నారు. తెలంగాణ జెండా ఎత్తినవారికీ, అన్ని పార్టీలకూ పెద్దదిక్కుగా నిలిచి దిక్సూచి అయ్యారన్నారు. సైద్ధాంతిక వైరుధ్యాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమ శక్తులన్నింటినీ ఏకంచేసే ప్రయత్నం చేశారని కొనియాడారు. 97ఏళ్ళ పండు వయసులోనూ ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రాష్ట్ర సాధనకై దీక్ష బూనారంటే ఈ ప్రాంత విముక్తిపట్ల ఆయనకు ఉన్న ప్రగాఢ వాంఛను అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన విలువలు, త్యాగం, లక్ష్యశుద్ధి, పట్టుదల, అంకితభావం, నిజాయితీ సర్వకాలాల్లో ఆచరణీయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *