వైద్యారోగ్యానికి తెలంగాణలో పెద్దపీట : కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (జనంసాక్షి) : హైదరాబాద్ నగరాన్ని హెల్త్ సిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వైద్యారోగ్యానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేస్తామని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ఆస్పత్రులు పనిచేయాలని సూచించారు. గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. క్యాన్సర్ కేర్ సెంటర్‌లో ఎన్నో అధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఆస్పత్రి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే విధంగా కాంటినెంటల్ ఆస్పత్రి ఉందని.. కాంటినెంటల్ ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్‌గా తానే ఉంటానని కేసీఆర్ అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు సైతం సేవాభావంతో పనిచేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యరంగం నిర్లక్ష్యానికి గురైందని కానీ తెలంగాణలో మాత్రం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తామన్నారు. వైద్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరం ఇప్పటికే హెల్త్ హబ్‌గా పేరొందిందని చెప్పారు. రాజధాని నగరాన్ని హెల్త్, మెడికల్, ఇండస్ట్రీ, టూరిస్ట్ హబ్‌గా రూపుదిద్దుతామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషిచేస్తోందన్నారు.





