Monday, 2 November 2026

జూబ్లీహిల్స్‌ సొసైటీ అక్రమాలపై కొరడా !

j-hills

 

పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : జూబ్లీహిల్స్‌ సొసైటీ అక్రమాలపై హైదరాబాద్‌ హైకోర్టు కొరడా ఝళిపించింది. జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి పూర్తిస్థాయి విచారణ కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. లీజు పేరుతో స్థలాలను అమ్ముకొన్న వైనంపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం విచారణ జరిపించాలని స్పష్టంచేసింది. చాలా కాలంగా కేసు విచారణ పెండింగ్‌లో ఉండడంపై న్యాయమూర్తి రామలింగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తంచేశారు. గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ.. విచారణకు ఆదేశించారు. జూబ్లీహిల్స్‌ సొసైటీలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. అక్రమాలు వాస్తవమేనని దర్యాప్తులో తేలింది. తప్పుడు రికార్డులతో ఏడు ప్రజోపయోగమైన స్థలాల్ని స్వాధీనం చేసుకున్నారని నిర్ధారణ అయింది. దీంతో 2002లో పలువురు సొసైటీ ఆఫీస్‌ బేరర్లపై నేరారోపణలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నిలిపివేయాలంటూ అక్రమాల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వి.జనార్ధన్‌బాబుతోపాటు ఎనిమిది దాఖలుచేసిన రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు తోసిపుచ్చారు. 2000 నవంబర్‌లో జనార్ధన్‌బాబుతో పాటు మరో ఎనిమిది జూబ్లీహిల్స్‌ సొసైటీ పాలక వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే అనేక అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు వచ్చాయి. ఏడు కీలక ప్రదేశాలను 50ఏళ్ల లీజు పేరుతో అమ్ముకున్టన్లు ఆరోపణలు వచ్చాయి. టెండర్లు ఆహ్వానించి స్థలాలు అప్పగించినట్లు, చెక్కులు కూడా తీసుకున్నట్లు రికార్డులు సృష్టించారు. కానీ, ఇదంతా లోలోపలే జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సొసైటీ శాఖతో పాటు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ కూడా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశాయి. దీంతో 2002లో జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిందితులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలుచేసి, తదుపరి విచారణ జరగకుండా స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారు. ఈ కేసు విచారణ గత వారం న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఏళ్ల తరబడి కేసు పెండింగ్‌లో ఉండడంపై న్యాయమూర్తి రామలింగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని రికార్డులను తెప్పించుకొని పరిశీలించిన ఆయన కేసు తీవ్రత, తీవ్రమైన అభియోగాలు ఉండడంతో తదుపరి విచారణ అవసరమని స్పష్టంచేశారు. రిట్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ.. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశాలు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *