ఉత్తరాఖండ్ జిమ్‌కర్బెట్ నేషనల్ పార్కు తరహాలో
జోడేఘాట్ అభివృద్ధి
ఆదిలాబాద్ తెలంగాణ కాశ్మీర్
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనంసాక్షి) : కొమురం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉత్తరాఖండ్ జిమ్‌కర్బెట్ నేషనల్ పార్కు తరహాలో జోడేఘాట్ అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అలాగే గిరిజన విశ్వవిద్యాలం ఏర్పాటుచేస్తామన్నారు. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అక్టోబర్ 8న కొమురం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. కొమురం భీం జల్, జంగల్, జమీన్ కోసం పోరాడారని, అలాంటి గొప్ప వ్యక్తి చరిత్ర కూడా మనవాళ్ళు తెలుసుకోలేనంతగా సమైక్య పాలనలో నిర్లక్ష్యం జరిగిందన సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. కొమురం భీం అంటే ఎవరు? ఆయన చేసిన త్యాగాలు ఏంటి అనే విషయాలను ప్రపంచానికి తెలపాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. జోడే ఘాట్‌ను టూరిస్టు స్పాట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ గిరిజన ఉత్సవాలు, భారతీయ గిరిజన సదస్సును కొమురం భీం పేరిట నిర్వమిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు పై భాగంలో ఆకుపచ్చని అడవితో ఇండియాకు కాశ్మీర్ వున్నట్లే ఉంటుందని, దానిని మరింత రమణీయంగా మార్చవచ్చని అన్నారు. కుంటాల జలపాతం, కవ్వాల్ ప్రాజెక్టు లాంటివి ఇప్పటికే వున్నాయని మరింత శ్రద్ధపెట్టి ఆదిలాబాద్ జిల్లాను తీర్చిదిద్దాలని చెప్పారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు విమాన సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. రోడ్డు రవాణానున మెరుగుపరుస్తామని చెప్పారు. కొమురం భీం పుట్టి పెరిగిన ప్రాంతలోనే గిరిజన యూనివర్సిటీ నెలకొల్పే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కొమురం భీం జీవిత విశేషాలతో ఒక డాక్యుమెంటరీ నెలకొల్పే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కొమురం భీం స్మారకార్థం సుమారు 200 ఎకరాలు సేకరించి కొమురం భీం మెమోరియల్ స్థాపిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 8న మెమోరియల్‌ను తానే శంకుస్థాపన చేస్తానని కూడా సీఎం చెప్పారు. సమావేశంలో ఐటి శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, జయధీర్ తిరుమల్‌రావు తదితరులు పాల్గొన్నారు.




