ముంబై, సెప్టెంబర్ 29 (జనంసాక్షి) : మహారాష్ట్రలో బీజేపీతో చెలిమి చెడిపోవడంతో కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని శివసేన నిర్ణయించింది. ఎన్డీఏ సర్కారులో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తమ పార్టీ నేత అనంత్ గీతే పదవి నుంచితప్పుకుంటారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనంత్ గీతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. మోడీ ప్రభుత్వంలో శివసేన తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అనంత్ గీతే. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బీజేపీ, శివసేన వేరుబాట పట్టాయి. ఇదిలావుంటే మహారాష్ట్రలో శివసేన పార్టీతో సుదీర్ఘకాలంగా కొనసాగిన పొత్తుకు స్వస్తి పలికిన నేపథ్యంలో భాజపా అక్కడ విస్తృత ప్రచారం చేయాలని యోచిస్తోంది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనను ఎదుర్కోవడానికి భాజపా రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 ర్యాలీలను నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధంచేస్తోంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళ, బుధ వారాల్లో పార్టీ ప్రధాన నాయకులు పర్యటించనున్నారని పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, నీటివనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ప్రకాశ్‌జవదేవకర్, నవజ్యోత్‌సింగ్ సిద్దూ మరికొందరు నాయకులు ఈ రెండు రోజుల పర్యటనల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. భారీగా ప్రచారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు
కబినెట్‌కు శివసేన గుడ్‌బై




