Monday, 2 November 2026

బెయిలు కోసం జయ ప్రయత్నాలు

07కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌

 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రత్యేక కోర్టు తనకు విధించిన నాలుగు సంవత్సరాల జైలుశిక్షను సవాల్‌ చేస్తూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్ణాటక హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె తరఫున న్యాయవాదులు ఈ పిటిషన్‌ వేశారు. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఆ పిటిషన్‌లో కోరారు. దీనిపై మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసులో జయలలితకు ప్రత్యేక కోర్టు 4 సంవత్సరాల జైలుశిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. శనివారం ఈ కేసు తుదితీర్పు వెలువరించిన వెంటనే జయను అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. దీంతో ఆమె ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పదవి కోల్పోవాల్సి వచ్చింది. తన వారసునిగా ఆమె పన్నీర్‌ సెల్వంను నియమించారు. ఇదిలావుంటే ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ రాంజెఠ్మలానీ ఆమె తరఫున వాదించనున్నారు. ఈ మేరకు జయ అనుచరులు ఆయనను సంప్రదించినట్లు సమాచారం. ఇదిలావుంటే జైలులో జయకు తోడుగా శశికళ ఉన్నారు. ఆమెతో పాటు శశికళ కూడా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 32 ఏళ్లుగా జయలలితకు ఆమె తోడుగానే ఉంటున్నారు. అందుకే జైల్లో కూడా ఆ తోడు వీడకుండా వెంనటే ఉన్నారు. 2011లో మాత్రం శశికళ బంధువులు కొంతమంది జయకు వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న వార్తలు వచ్చినప్పుడు వాళ్లనే వదులుకున్నారు తప్ప జయలలితను మాత్రం వదల్లేదు. చివరకు తన భర్తకు కూడా చాలాకాలం పాటు దూరంగానే ఉన్నారు. 1982 నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సందర్భాల్లోనే జయలలిత తోడును శశికళ వీడారు. తొలిసారి 1995-96లో ఆమెను జేజేటీవీ పరికరాల దిగుమతి కేసులో ఈడీ అరెస్టు చేసింది. రెండోసారి 1996 మేలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయలలితే ఆమెను తన ఇంటినుంచి బయటకు పంపేశారు. మూడోసారి ఆమెతోపాటు మరో 11మంది బంధువులను 2011లో జయలలిత ఇంట్లోంచి పంపేశారు. శశికళ గురించి అందరికీ తెలిసిన విషయాలకు, ఆమెకు లభించే ప్రాధాన్యానికి ఏమాత్రం పొంతన ఉండదు. జయలలితతో స్నేహం అంటే చాలా కష్టమని, అయినా ప్రతిసారీ శశికళ మాత్రం ఆ కష్టాన్ని అధిగమిస్తూనే ముందుకు వెళ్లగలిగారని అంటారు.

తమిళనాట కుదుటపడుతన్న పరిస్థితులు

ఇదిలావుంటే తమిళనాట పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయి. జయ అరెస్ట్‌తో పలువురు ఆందోళనకు దిగారు. బంద్‌ పాటించారు. వీరాభిమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అమ్మకు ఇంత అన్యాయమా.. మేం తట్టుకోలేం అంటూ అనేకమంది అసువులు బాశారు. పురుచ్చితలైవి జయలలిత జైలు పాలయ్యారని తెలిసి, తట్టుకోలేక.. గుండె పగిలి తమిళనాడులో 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు ఉరేసుకోగా, అన్నాడీఎంకే మద్దతుదారుడు ఒకరు ఒంటికి నిప్పంటించుకున్నాడు. మరో అభిమాని వేగంగా వస్తున్న బస్సు ముందు దూకి మరణించాడు. ఇంకొకరు విషం తాగారు. వీళ్లు కాక ఇంకో పదిమంది జయలలిత గురించి టీవీలలో కథనాలు రాగానే గుండెపోటుతో మరణించారు. ఇంటర్‌ విద్యార్థి సహా ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతి చేసుకోడానికి ప్రయత్నించారు. వారు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో వ్యక్తి అయితే తిరుపూరులో తన చిటికెన వేలును కోసేసుకున్నాడు. జయలలితకు ఉన్న ప్రజాదరణ కారణంగానే ఇలా జరుగుతోందని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే, ఎవరూ ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జయలలితను తమ అమ్మగానే భావిస్తారని అన్నాడీఎంకే మహిళా విభాగం ఉప కార్యదర్శి సీఆర్‌ సరస్వతి చెప్పారు. తమిళనాడులో సినీనటులు, రాజకీయ నాయకులను విపరీతంగా ఆరాధిస్తారని, ఇలాంటి రాష్ట్రంలో వాళ్లకు ఏమైనా అయ్యిందని తెలిస్తే గుండె పగలడం, ఆత్మహత్యలు చేసుకోవడం సాధారణమేనని ఓ విశ్లేషకుడు అన్నారు.

రాష్ట్రపతి పాలన పెట్టాలన్న సుబ్రమణ్యం

తమిళనాట రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి మరోమారు కోరారు. తమిళనాడు అగ్నిగుండంగా మారుతోందని, అందువల్ల అక్కడ రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్రమాస్తుల కేసులో జయలలితను జైల్లో పెట్టడంతో అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహానికి గురై బస్సులను తగలబెట్టడం లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనిలా అన్నారు. అక్కడ పరిస్థితతులు అదపుతప్పుతున్నాయన్నారు. మరోవైపు తమిళనాడుకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. తిరుపతి నుంచి చెన్నైకి బస్సులు నడపలేమంటూ ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. దాంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేటు ట్రావెల్స్‌ వాళ్లు అధిక రేట్లు వసూలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *