మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : తెలంగాణలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడబోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అందించనున్నట్లు తెలిపారు. నకిలీ, దొంగ సర్టిఫికెట్లను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయమై తాము విద్యాశాఖ, పోలీసుశాఖలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్‌స్లర్లతో కూడా చర్చించామన్నారు. నకిలీలను అరికట్టేందుకు అన్ని సర్టిఫికెట్లను ఆన్‌లైన్ చేయాలన్న ఆలోచన ఉందని, గత 30 ఏళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నింటినీ ఆన్లైన్ చేస్తామని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్ నకిలీ సర్టిఫికెట్ల నిరోధానికి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో నకిలీ ధ్రువపత్రాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. నకిలీ ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై నేడు ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులు, సీపీ మహేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధ్రువీకరణ పత్రాలన్నీంటిని ఇకనుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతామన్నారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి పలు యూనివర్సిటీల వీసీలు, రిజిస్టార్లు, ఐటీ నిపుణులు, పోలీసు అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. స్కూళ్ల రేషనలైజేషన్ జీవో అమలవుతుందని, అవసరమైతే ఈ జీవోకు మార్పు చేర్పులు చేస్తామని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్దీకరణపై ఉపాధ్యాయ సంఘాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయని జగదీష్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయసంఘాల జేఏసీ నేతలు నేడు మంత్రిని కలిసి హేతుబద్దీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడదు. పాఠశాలలు మూసివేయకూడదన్నదే ప్రభుత్వ నిర్ణయం. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగిస్తాం. హేతుబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వులు కొనసాగుతాయి. ఆరో నంబర్ ఉత్తర్వులో మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని ఉపాధ్యాయసంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా చర్చించినట్లు సమాచారం.





