Monday, 2 November 2026

స్మార్ట్‌సిటీల నిర్మాణంలో అమెరికా సహాయం తీసుకుంటాం : మోడీ

ప్రపంచంలో కీలకశక్తిగా భారత్‌ : ఒబామా

రక్షణ ఒప్పందం పదేళ్లు పొడిగింపు

ఆర్థిక సంబంధాలు, అంతర్జాతీయ స్థితిగతులు,

పశ్చిమాసియాలో హింస తీవ్రవాదం, పౌర, అణు ఒప్పందాలపై చర్చలు

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) : స్మార్ట్‌సిటీల నిర్మాణంలో అమెరికా సహాయం తీసుకుంటామని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో కీలకశక్తిగా భారత్‌ అవతరించనుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. రక్షన ఒప్పందం పదేళ్ళు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంబంధాలు, అంతర్జాతీయ స్థితిగతులు, పశ్చిమాసియాలో హింస తీవ్రవాదం, పౌర, అణు ఒప్పందాలపై ఇరువురు చర్చలు జరిపారు. భారత-అమెరికా దేశాల మధ్య గల మైత్రీ సంబంధాలు ఎంతో పురాతనమైనవని, ఉభయ దేశాల మైత్రీ సంబంధాలూ భవిష్యత్తుకు బంగరు బాటలు వేయడానికి వీలుగా ఇప్పుడే ఒక లక్ష్య నిర్దేశనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు వీరిద్దరూ సంయుక్తంగా ఒక వ్యాసం రాశారు. భారత, అమెరికాలు సహజ మిత్రదేశాలని ఒకపడు అతల్‌ బెహారీ వాజపేయి చెప్పిన మాటలను వీరు తమ వ్యాసంలో ఉటంకించిన ఈ వ్యాసం మంగళవారం వాషింగ్టన్‌ పోస్ట్‌లో వచ్చింది. దీని గురించి ముందుగా ఎవరికీ తెలియదు. సోమవారం సైతం అందరూ ఈ సంయుక్త వ్యాసం ఎందులో వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూశారు. మంగళవారంనాడు వాషింగ్టన్‌ పోస్ట్‌లో ప్రచురితమైన తర్వాతే అందరికీ ఈ వ్యాసం గురించి తెలిసింది. మోదీ భారత్‌ నుంచి అమెరికాకు బయలుదేరేముందు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఒక వ్యాసం రాశారు. ఆ తర్వాతే ఇరువురూ కలిసి మరో వ్యాసం రాయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ వ్యాసంలో ఏయే అంశాలను స్పృశించాలన్న విషయం మోదీ అమెరికా చేరుకున్న తర్వాతే ఖరారయ్యింది. వీరిద్దరూ సోషల్‌ విూడియాలో నిష్ణాతులే కాబట్టి పరస్పరం ఇమెయిల్స్‌ రాసుకుని ఫలానా అంశంపై ఫలానా దృక్పథాన్ని ప్రపంచానికి చాటాలని భావించి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంత కాలం ఉభయదేశాల మధ్యా ఎంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఉభయులం కలిసి సాధించగలిగినంత సాధించలేదని, భారతదేశంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ దిశగా మరింత కృషిచేస్తుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయబద్ధమైన వాణిజ్యం, నౌకాయానం, పరస్పరం ప్రయోజనం పొందగల విధంగా వైజ్ఞానిక-సాంకేతిక శాస్త్రాలను వినియోగం, ప్రజలకు ఎంతో ఉపకరించగల పారిశుధ్ధ్యం, ఉభయ దేశాలకూ పరస్పరం ఉపకరించే ఇతర రంగాలను కూడా గుర్తించి ఆయా రంగాలలో భారత-అమెరికా సంబంధాలు మరింతగా మెరుగుపడడానికి ఉభయదేసాలూ చిత్తశుద్ధితో కృషిచేయాలని వారు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శ్వేతసౌధంలో ఏర్పాటుచేసిన విందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. ఆయనకు సౌధం బయట ఒబామా సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒబామా గుజరాతీ భాషలో మోదీని పలకరించి అందరినీ ఆకట్టుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు 20 మంది ప్రముఖులు విందులో పాల్గొన్నారు. అనంతరం ఒబమాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దౌత్య బంధం, ఉగ్రవాదాన్ని అరికట్టే మార్గాలపై చర్చించినట్లు సమాచారం. సాయంత్రం వీరివురు ఓవల్‌హౌస్‌లో మరోసారి సమావేశమయ్యారు. అనంతరం మోదీ, ఒబామా సంయుక్తంగా విూడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఇక్కడే ఒబామాతో విదేశాంగా మంత్రి జాన్‌ కెర్రీ కూడా సమావేశమయ్యారు. విమానాశ్రయంలో మోడీకి ఘనంగా స్వాగతం లభించింది. ఎన్‌ఆర్‌ఐలు పెద్దఎత్తున మోడీకి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *