హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : అమరవీరుల కుటంబాలన్నింటికీ సాయమందించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అందుకు సంబంధించిన జాబితా తాము అందిస్తామన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం విడుదలపై జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం హర్షం వ్యక్తంచేశారు. ఆర్థిక సాయం జాబితాలోలేని అర్హులెవరైనా ఉంటే జేఏసీని సంప్రదించవచ్చని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయంపై ప్రొఫెసర్ స్పందిస్తూ.. అర్హులైన కొన్ని కుటుంబాల పేర్లు జాబితాలో మిస్సైనట్లుందని, 600లకుపైగా అమరవీరుల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని త్వరలోనే ¬ంమంత్రికి ఇస్తామని ఆయన వెల్లడించారు. కొందరి పేర్లు లేవన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ అందరికీ అందేలా చూస్తామన్నారు. ఇప్పటివరకు కలెక్టర్ల నుంచి అధికారికంగా అందిన నివేదిక ప్రకారం 462 మంది అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం మంజూరుచేస్తూ ఉత్వర్వుపై సోమవారం కేసీఆర్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని జిల్లాల వారిగా అతి త్వరలో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం గౌరవపూర్వకంగా అందిస్తుందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో వచ్చే అధికారిక నివేదికల ప్రకారం మిగతా కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. ఈ నిర్ణయంపై వచ్చిన భిన్నాభిప్రాయాలపై కోదండరాం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబాలన్నింటినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంపై పలువురి అభిప్రాయాలు సేకరిస్తే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు. అమరుల ఏ కుటంబాన్ని విస్మరించకూడదని అన్నారు.
అమరవీరులందరికీ సాయమందాలి ..జాబితా మేమిస్తాం : కోదండరాం





