బెంగళూరు, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష పడిన జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. ఈ కేసు 6వ తేదీకి వాయిదా పడింది. దసరా నవరాత్రులు జయలలితకు జైలులోనే ముగిసేలా ఉన్నాయి. అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్టోబర్ 6వ తేదీ వరకూ జైల్లోనే గడపాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆమె దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణకు చేపట్టింది. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీ వరకూ వాయిదా వేసింది. దాంతో జయ సోమవారం వరకూ జైల్లోనే ఉండాలి. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో పార్టీ కార్యకర్తలు నిరాశ చెందారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జయతో పాటు జైలు శిక్షకు గురైన శశికళ, సుధాకరన్, ఇళవరసిలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. జయ బెయిల్ పిటిషన్ వాయిదా పడంతో అన్నాడిఎంకె కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఆమె బెయిల్ కోసం సానుకూల పరిణామం ఉంటుందని భావించి వేలాదిగా కార్యకర్తుల బెంగుళూరుకు వచ్చారు. మరోవైపు కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం నేతలు కూడా బెంగుళూరుకు చేరుకోవడంతో తమిళనాడు ప్రభుత్వం అంతా ఇక్కడే ఉన్నట్లు అయ్యింది. దీంతో తమిళనాడు రాజధాని నగరాన్ని బెంగళూరుకు మార్చారా అన్న అనుమానం కలిగేలా ఉంది. అలాగే సచివాలయాన్ని కూడా పరప్పన అగ్రహార అనే ప్రాంతానికి తరలించేసిందా అన్న రీతిలో మంత్రులు ఇక్కడకు చేరుకున్నిరు. ఇదిలావుంటే తమిళ రాజధాని బెంగుళూరుగా మారిందని సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ సంచలన విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. భారతదేశం అంతా ఒక్కటిగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏవిూ అక్కర్లేదని కూడా వర్మ అన్నారు. విషయం ఏమిటంటే, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పరప్పన అగ్రహార ప్రాంతంలోని జైల్లో ఉండటం, తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. అయితే.. అన్నాడీఎంకే లాంటి పార్టీలో ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా వెనక ఉండి పావులు కదిపేది మాత్రం ‘అమ్మ’ మాత్రమేనన్నది వర్మ వ్యాఖ్యల్లోని అంతరార్థం. మరోవైపు జయలలితకు విధించిన జైలు శిక్షను నిరసిస్తూ తమిళ చలనచిత్ర పరిశ్రమ నిరాహార దీక్ష చేపట్టింది. చెన్నైలోని చెపాక్లో ఈ నిరహార దీక్ష జరుగుతుంది. ఈ దీక్షలో చలనచిత్ర ప్రముఖ నటులు, బుల్లితెర నటీ నటులు పాల్గొన్నారు. జయకు మద్దతుగా తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్కు సినిమా ఎగ్జిబిటర్ల సంఘం పిలుపునిచ్చింది.జయలలితకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా సినీపరిశ్రమ స్తంభించింది. తమిళనాడులో మంగళవారం ఎక్కడా ఒక్క సినిమా కూడా ఆడలేదు. థియేటర్లన్నీ మూతపడ్డాయి. దాంతోపాటు తమిళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం సభ్యులంతా మంగళవారం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. తమిళ సినీ నిర్మాత లమండలి, దక్షిణ భారత కళాకారుల సంఘం కూడా ఈ నిరాహార దీక్షకు తమ సంఘీభావం తెలిపాయి. ఇదిలావుంటే జయలలిత అరెస్టుతో తమిళనాడులో అనేకమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. మరికొంతమందికి గుండెపోట్లు వచ్చాయి. మొత్తం 16 మంది మరణించారు. కోర్టు తీర్పు గురించి తాము ఏవిూ వ్యాఖ్యానించలేమని, అయితే జయలలితకు మాత్రం సంఘీభావంగా ఉంటామని సినీ పరిశ్రమ చెబుతోంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయ.. తమిళ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.
జయ కేసులో జెఠ్మాలానీ వకల్తా





