వరంగల్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : బంగారు తెలంగాణలో వ్యవసాయమే కీలకమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వ్యవసాయమంటే దండగ అనే పరిస్థితి నుంచి పండగ అనే స్థితికి మారుస్తామని అన్నారు. వరంగల్ జిల్లాలో విత్తనాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వ్యవసాయం దండగ అనే అభిప్రాయం నుంచి పండుగగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ తరలింపుపై చర్యలు తీసుకొనున్నట్లు మంత్రి వెల్లడించారు. వరంగల్ కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామిక రంగానికి అంతే ప్రాధాన్యం ఇస్తామన్నారు. రబీలో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాడి అభివృద్ధికి డ్వాక్రా, పాల ఉత్పత్తిదారుల సంఘాలకు స్త్రీనిధి పథకం కింద పాడిగేదెలు ఇస్తామన్నారు. మత్స్యకారులకు దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామన్నారు. చేపలు అమ్ముకొనేందుకు గ్రామ, మండల స్థాయిలో మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడంలేదని అన్నారు. అయితే రైతులకు విద్యుత్ ఇవ్వడం ద్వారా పంటలు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఒక్క నిముషం తక్కువ కాకుండా ఐదు గంటలు ఇచ్చేలా విద్యుత్‌శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రెండు రోజుల్లో 500 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం కొనే అవకాశం ఉందని.. దీంతో మరో గంట అదనంగా విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత అవసరమో అంత విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో సమస్య తలెత్తిందని, రైతులు సమన్వయం వహించాలని మంత్రి సూచించారు. ప్రాజెక్ట్‌ల ఆయకట్టు ప్రాంతాల్లో లేని మహిళా రైతులకు పాడి, గొర్రెల పోషణ కోసం ఐకేపీ నుంచి రుణసౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఒక్కొక్క జిల్లాకు రూ.50కోట్ల నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలియజేశారు. అలాగే చేపల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తుంపర సేద్యానికి జిల్లాకు రూ.18కోట్లు కేటాయించడం జరిగిందని ఆ విషయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్, జడ్పీ చైర్పర్సన్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణలో యౌసమే కీలకం : పోచారం





