
నివాళ్లర్పించిన గవర్నర్, ముఖ్యమంత్రి
హైదరాబాద్, అక్టోబర్ 2 (జనంసాక్షి) : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళ్ళర్పించారు. బాపూ 145వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీ సేవలను స్మరించుకుంటూ.. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో పలువురు ప్రముఖులు మహాత్ముడికి ఘనంగా నివాళులు అర్పించారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి గురువారం ఉదయం బాపూఘాట్‌కు గవర్నర్ మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, హరీశ్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్‌నేతి విద్యాసాగర్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు వి.హుమంతరావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు కూడా బాపూ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. బాపూజీ జీవిత చరిత్రను వివరిస్తూ.. ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం గవర్నర్, సీఎం మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన మార్గాల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రయామని అన్నారు. అటు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం బాపూఘాట్ భూముల ఆక్రమణపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. విజయవాడలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ సేవలను ప్రస్తుతించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేపట్టిన పోరాటాన్ని కీర్తించారు. మహాత్ముడి స్ఫూర్తితో పేదల కోసం పాటు పడతానని బాబు హావిూ ఇచ్చారు.హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు బాపూ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లోనూ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ మార్గం అందరికీ అనుసరణీయం అని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం, వైఎస్సార్‌సీపీ కార్యాలయాల్లోనూ జయంతి వేడుకలు నిర్వహించారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల బాహాబాహి
గాంధీ జయంతి సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు గొడవకు దిగారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసే విషయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యక్రమల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. నాగోల్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు బామాబాహీకి దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామ్మోహన్‌గౌడ్ మధ్య పూలమాల వేసే విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.




