
నాలుగేళ్లలో ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగం
సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 2 (జనంసాక్షి) : ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. నాలుగేళ్ళలో తాగునీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగబోమని ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యులు, ఎంపీలకు ఆయన సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హావిూలన్నింటినీ నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు. తెలంగాణలో అత్యధికంగా సాగునీటిని అందించే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, వచ్చే జూన్‌లో చెరువుల పూడికతీత మొదలుపెడతామన్నారు. జూలైలో హరితవనాన్ని ఉద్యమంగా చేపడతామని చెప్పారు. దీనికోసం 500 మంది కళాకారుల బృందంతో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ఏర్పాటుచేసిన వేడుకల్లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, సభాపతి మధుసూదనాచారి, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ సభాపతి, ఉపసభాపతి, మంత్రి హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నేతలు చర్చించారు. ఈ నెల 20 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో ప్రాథమికంగా నిర్ణయించారు. దీపావళి పండు దృష్ట్యా మధ్యలో మూడు రోజుల పాటు సమావేశాలకు విరామం ఇవ్వనున్నారు. 20నుంచి అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 20న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు నవంబర్ రెండో వారం వరకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్‌తో పాటు కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైతే మరిన్ని రోజుల పాటు సమావేశాలు పొడిగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీపావళి పండుగ దృష్ట్యా మూడు రోజుల పాటు అసెంబ్లీకి సెలవు ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు సర్వసన్నద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హావిూలన్నింటినీ నిలబెట్టుకుంటుందని, ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. తెలంగాణ వాటర్‌గ్రిడ్‌ను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామన్నారు. నాలుగేళ్లలోపు మంచినీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగబోమని ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ప్రభుత్వం ఇప్పటివరకు ప్రణాళికల రూపకల్పనకే పరిమితమైందని, ఇకనుంచి కార్యాచరణ మొదలవుతుందని కేసీఆర్ అన్నారు. పింఛన్ల పెంపు, చెరువుల పునరుద్ధరణ, హరితవనం వంటి పథకాలను వరుసగా ప్రారంభిస్తామన్నారు.




