పారిశ్రామిక వాడల్లో పవర్‌హాలిడే
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 7 (జనంసాక్షి) : విద్యుత్ కేటాయింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పారిశ్రామిక రంగానికి పవర్ హాలిడే ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయాన్ని కాపాడుతామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హావిూ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్ మంగళవారం ఉన్నతాధికారులతో పవర్ పరిస్థితిపై చర్చించారు. వ్యవసాయానికి సరఫరాచేసి పారిశ్రామిక ప్రాంతాల్లో బుధవారం నుంచి పవర్ హాలిడే ప్రకటించింది. వారానికి రెండు రోజులపాటు విద్యుత్ కోతలు విధించనున్నట్లు ట్రాన్స్‌కో ఏడీఈ అంబేద్కర్ ప్రకటించారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమ, మంగళవారాల్లో కోతలు విధించనున్నారు. పటాన్‌చెరు, పాశమైలారంలో బుధ, గురు వారాల్లో కరెంటు కోతలు విధించనున్నట్లు ఏడీఈ అంబేద్కర్ తెలిపారు. దీంతో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వడం ద్వారా ముందు వ్యవసాయానికి సరఫరా పెంచనున్నారు. గత కొన్ని రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. నిరుటితో పోలిస్తే వినియోగం 20 మిలియన్ యూనిట్ల పెరిగింది. మరోవైపు ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలో లేదు. విద్యుత్ లోటు భర్తీకి వీలుగా విస్తృతంగా కొనుగోళ్లు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు దక్షిణాది, జాతీయ గ్రిడ్ల నుంచి అందుబాటులో ఉన్న విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. యూనిట్‌కు రూ. 8.50 ధరతో సోమవారం 14 మిలియన్ యూనిట్లను కొంది. దీంతో మొత్తం సరఫరా 137 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇంకా 19మిలియన్ యూనిట్ల కొరత ఉంది. దీనిని భర్తీ చేసేందుకు వీలుగా అదనపు కొనుగోళ్ల కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తక్షణంగా దీనిని భర్తీచేసేందుకు పవర్ హాలిడే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏడాది తర్వాత 10 శాతం మేరకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 శాతం మేరకు విద్యుత్ డిమాండ్ పెరుగుదల చోటుచేసుకోవడం గమనార్హం. గత పాలకుల వివక్ష, ప్రస్తుతం వేసవిని తలపిస్తున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణ జిల్లాలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అధికారికంగా కోతలు విధించినప్పటికీ కష్టాలు మాత్రం గట్టెక్కడంలేదు. దీంతో అవసరాలకోసం ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఎంత ధరకైనా కరెంటును కొనుగోలుచేసి పంటలను కాపాడడంతో పాటు ప్రజలకు విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లోటు కారణంగా వ్యవసాయరంగానికి నిర్దేశిత విద్యుత్‌సరఫరా అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయరంగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే వాతావరణ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడం, మార్చి నాటి ఎండలను తలపించేలా భానుడి ప్రతాపం ఉండడం వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతున్నది. దీంతో రైతాంగం పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికరంగానికి వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించడమే కాకుండా పట్టణాలు, ముఖ్యనగరాల్లో కొన్ని గంటలపాటు అధికారిక కరెంటు కోతలను అమలుచేస్తున్నది. ఆ మేరకు వ్యవసాయరంగానికి మళ్లిస్తున్నారు. ఇప్పటికే డిమాండ్, సరఫరా మధ్య అంతరం క్రమంగా పెరిగిపోతుండడంతో వీలైనంతమేరకు వ్యవసాయరంగానికి కరెంటు కోతలను తగ్గించి ఇతర గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు కోతలను పెంచుతున్నారు. నాగార్జునసాగర్‌లో 30 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది.





