ముంబై, అక్టోబర్ 8 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యక్తి భజన మానాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హితవు పలికారు. ఓ వ్యక్తితో అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు. మోడీ భజన మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాన్నారు. బుధవారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన బిజెపిపై విమర్శల వర్షం కురిపించారు. నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి అన్న రీతిలో ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలన్నారు. గడిచిన 60ఏళ్ళలో కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతున్నాడని ఒక వ్యక్తి మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలడని ఆయన భావిస్తున్నాడని అన్నారు. కేవలం మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే బిజెపికి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కానరావడం లేదన్నారు. గడిచిన ఉప ఎన్నికల్లో బిజెపికి తగిలిన ఎదురుదెబ్బతో ఆ పార్టీ నాయకులు కంగుతిని ఎదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కేవలం ఒక వ్యక్తి ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేడని, సమిష్టిగా కృషిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహరాష్ట్ర, హర్యానా ఉప ఎన్నికల్లోనూ బిజెపి ప్రజలు తమ ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన మూడు నెలల్లోనే ఎదురుగాలి వీచడం చూస్తుంటే బిజెపి ఐదేళ్ళు పాలన కొనసాగించడం అనేక అనుమానాలు నెలకొంటున్నాయని అన్నారు.
ఓ వ్యక్తితో అభివృద్ధా? మోడీ భజన మానండి : రాహుల్





