http://JanamSakshi.org/imgs/2014/10/8.jpg
భూములు వెనక్కి తీసుకున్న తెలంగాణ సర్కారు
హైదరాబాద్, అక్టోబర్ 8 (జనంసాక్షి) : ఏపీ ఫిలీం డెవలప్‌మెంట్‌కు తెలంగాణ సర్కారు గట్టి షాక్ ఇచ్చింది. భూములు వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఏపీ చిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి (ఏపీఎఫ్‌డీసీ)కి కేటాయించిన 16 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది. ఆ కేటాయింపులను రద్దు చేస్తూ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ పిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో బంజారాహిల్స్‌లో ప్రభుత్వం 20ఎకరాల భూమిని కేటాయించింది. అందులో నాలుగు ఎకరాలు ఆక్రమణలకు గురైంది. ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. మిగిలిన 16ఎకరాలను ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధీనంలో ఉంది. విభజన అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపయోగంగా పడి ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవోలకు సంబంధించిన భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నంచేయగా ఏపీ ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో టీ. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తర్వాత ఏపీ పిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన 16ఎకరాల భూమి నిరుపయోగంగా పడి ఉందని, దానిపై విచారణ జరిపిన అనంతరం ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని టీ. ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఆ భూమిలో తెలంగాణ ప్రభుత్వం బోర్డు కూడా పెట్టిన విషయం తెలిసిందే.




