
ఆజాద్ హిందూ ఫౌజ్‌లో అబ్బాస్ కీలకపాత్ర
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (జనంసాక్షి) : నేతాజీ సహచరుడు కెప్టెన్ అబ్బాస్ మరణించారు. నేతాజీ సుభాష్ చంద్రబోష్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్‌లో ఆయన కీలకపాత్ర పోషించారు. 1978లో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికైన ఆయన చివరిశ్వాస వరకు సమసమాజ స్థాపన ప్రధాన లక్ష్యంగా సాగుతానని ప్రకటించారు. న్యూఢిల్లీ కార్యక్షేత్రంగా తన కృషిని సాగిస్తున్నారు. కెప్టన్ అబ్బాస్ అలీ స్వల్ప అస్వస్థతో శనివారం కన్నుమూశారు. మాతృభూమి విముక్తి కోసం అటు భారత జాతీయ సైన్యం యోధునిగా ఆంగ్లసైన్యాలతో తలపడి, ఇటు సామ్యవాదం లక్ష్యంగా ఎంచుకుని సాగుతున్న రాజకీయ పోరాటాలలో చురుగ్గా పాల్గొన్న కెప్టన్ అబ్బాస్ అలీ 1920 జనవరి మూడున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లా ఖుర్‌జా గ్రామంలోని జమీందారి కుటుంబాన జన్మించారు. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఆంగీకరించని ముస్లిం రాజపుత్ర కుటుంబం నుండి వచ్చిన అబ్బాస్ అలీ ఉన్నత పాఠశాల విద్యార్థిగా సర్దార్ భగత్‌సింగ్ స్థాపించిన ‘నౌజవాన్ భారత్ సభ’లో సభ్యులయ్యారు. ఆ తరువాత ఉన్నత విద్యకోసం అలీఘర్ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన ఆయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ కున్వర్ ముహమ్మద్ అష్రాఫ్ శిష్యరికంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యత్వం చేపట్టారు. అష్రాఫ్ ప్రేరణతో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో తిరుగుబాటుకు ప్రోత్సాహించాలన్న ఉద్దేశ్యంతో అబ్బాస్ అలీ వ్యూహాత్మకంగా 1939లో బ్రిటిష్ సైన్యంలో చేరారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1941లో ఆయన సింగపూర్ వెళ్ళారు. 1942లో జపాన్ సైన్యాలకు బ్రిటిష్ బలగాలు లొంగిపోవడంతో ఇతర సైనికులు, సైన్యాధికారులతోపాటుగా అబ్బాస్ అలీ యుద్ధఖైది అయ్యారు. ఆ సందర్భంగా, 1943లో చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షాహ్ జఫర్ సమాధి వద్ద నేతాజీ సుభాష్‌చంద్రబోస్ చేసిన ప్రసంగం మాతృభూమి విముక్తి కోసం అకింతమయ్యేందుకు అబ్బాస్‌ను సంసిద్ధం చేసింది. భారత జాతీయ సైన్యంలో చేరిన ఆయనకు ‘కెప్టన్’ హోదా లభించింది. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదానికి అనుగుణంగా అంగ్ల సైన్యాలతో పోరాటానికి అబ్బాస్ అలీ అరకాన్ యుద్ధక్షేత్రం వెళ్ళారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్ పరాజయంతో భారత జాతీయ సైన్యం వెనకడుగువేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో బ్రిటిష్ సైన్యం భారత జాతీయ సైన్యం యోధుల తోపాటుగా ఆయనను అరెస్టు చేసింది. అరెస్టు తరువాత బ్రిటిష్ సైన్యాధికారులు కోర్టు మార్షల్ జరిపి అబ్బాస్‌కు మరణశిక్ష ప్రకటించారు. ఈలోగా బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత దేశానికి పూర్తిగా స్వాతంత్య్రం లభించడంతో ఆయనకు విధించిన మరణశిక్ష రద్దయ్యింది. స్వాతంత్య్రం లబించాక 1948లో ఆచార్య నరేంద్రేవ్, జయప్రకాష్ నారాయణ, డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా సహచర్యంలో సోషలిస్టు పార్టీ నాయకులుగా ఆబ్బాస్ అలీ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ కృషిలో భాగంగా ప్రజల పక్షంగా అబ్బాస్ అలీ సాగించిన పోరాటాల ఫలితంగా 1948 నుండి 1974 వరకు ఆయన 50 సార్లకు పైగా ఆరెస్టు, ప్రభుత్వ నిర్బంధాలకు గురయ్యారు. చివరకు 1975లో ఏర్పడిన అత్యాకపరిస్థితి, నియంతృత్వ పోకడలను వ్యతిరేకించినందుకు గాను అబ్బాస్ అలీ 19 మాసాలు జైలులో గడపాల్సి వచ్చింది.




