తెలంగాణ నగరాల అభివృద్ధి నాదే బాధ్యత
వాటర్ గ్రీడ్‌కు 105 కోట్లు విడుదల
కొత్తగూడెంలో ధర్మల్‌ప్లాంట్
చెరువుల పునరుద్దరణకు యాక్షన్ ప్లాన్
సీఎం కేసీఆర్
హైదరబాద్,అక్టోబర్14(జనంసాక్షి) : హుధుద్ తుపాను కారణంగా దెబ్బతిన్న పొరుగు రాష్ట్రం ఆంధప్రదేశ్‌ను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి రూ.18 కోట్ల విలువైన విద్యుత్ సామాగ్రిని పంపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 530 ట్రాన్స్‌ఫార్మర్లు, 28,500 స్తంభాలు, 900 కిలోవిూటర్ల నిడివిగల వైర్లు పంపుతున్నట్టు తెలిపింది.
నగరాల అభివృద్దికి పక్కా ప్రణాళిక
హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని ఐదు ప్రధాన నగరాల అభివృద్ధి బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ర చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు కలిసినపుడు వారితో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వారితో నగరాల అభివృద్ధిపై చర్చించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలను కూడా తానే చూస్తానని పేర్కొన్నారు. ఈ నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని రేపటి తెలంగాణలో కీలక నగరాలుగా మారుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నగరాలు ప్రణాళికాబద్దమైన అభివృద్ధి జరగాల్సి ఉందని అన్నారు. ఖమ్మంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలేదని, కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని అన్నారు. నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత స్వయంగా నగరాలను సందర్శిస్తానన్నారు. నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. సమస్యలను స్వయంగా చూసి పరిష్కార మార్గాలను కనుగొంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని అసెంబ్లీ, సీఎం కార్యాలయం వద్దే వర్షం పడితే నీళ్లు ఆగిపోతున్నాయని తెలిపారు. నగరంలో నాలాలు కబ్జాకు గురయ్యాయని వెల్లడించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే రూ.10 వేల కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారన్నారు. అయితే మిగతా నగరాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అని వరంగల్ కూడా అతిపెద్ద నగరంగా సమగ్ర అభివృద్ది సాధించాలన్నారు. ఖమ్మం పట్టణం కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు బాగా విస్తరిస్తోందని, అక్కడ కూడా నగర స్వరూపం కూడా మారుతుందని అన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. నల్లగొండ పట్టణం కూడా బాగా విస్తరిస్తోందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. నగరాల్లో ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను కూడా చక్కదిద్దాల్సి ఉందన్నారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా అన్ని నగరాలకు మంచినీరు అందిస్తామని స్పష్టం చేశారు. నగరాల్లో నీళ్లు, రోడ్లు,పారిశుద్ధ్యం, విద్య, వైద్య రంగాలపై దృష్టి సారిస్తామని హావిూ ఇచ్చారు.
వాటర్ గ్రిడ్ కోసం 105 కోట్లు విడుదల
యుధ్దప్రాతిపదికన వాటర్‌గ్రిడ్ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వాటర్‌గ్రిడ్ పథాకానికి నిధులు కేటాయించనున్నట్టు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. వాటర్‌గ్రిడ్ పథాకానికి సర్వే కోసం రూ.105 కోట్లు కేటాయించినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. పథకానికి సంబంధించిన అన్ని వివరాలు తనకు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఆయన అధికారులు, మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సర్వే పనులు పూర్తిచేసి సమాంతరంగా ఒకేసారి పనులు ప్రారంభించాలన్నారు. తెలంగాణలో ఇంటింటికి నల్లా ద్వారా మంచినీటిని అందించే బృహత్తర పథకం ఇదని అన్నారు. దీనిని విజయవంతం చేసేందుకు గట్టిగా కృషి చేయాలన్నారు. జూరాల,శ్రీశైలం, నాగార్జునసాగర్, గెడ్డన్న, శ్రీరాంసాగర్, పాకాల, లక్నవరం తదితర ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకుని పైపుల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. దాదాపు 25వేల ఆవాసాలకు అందించాల్సి ఉంటుందన్నారు. దీనికి ఏ రకమైన పైపులు వాడితే మంచిదో ఆలోచించి టెండర్లు పిలవాలన్నారు. దాదాపు లక్షా 32 వేల కిలోవిూటర్ల పైపులు అవసరమవుతాయని, అవన్నీ తెలంగాణలోనే ఉత్పత్తి చేసేందుకు ఒప్పించాలన్నారు. పరిశ్రమల వల్ల నిరుద్యోగం పోతుందని, దీనికి అవసరమైన కరెంట్ కూడా లెక్కగట్టి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సవిూక్షలో మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, డిప్యూటీ సిఎం రాజయ్య, ఎంపీ బాల్క సుమన్, కెవి రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో థర్మల్ పవర్‌ప్లాంట్
విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. రామగుండం థర్మల్ విద్యుత్ ప్లాంట్ తరహాలోనే ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నూతనంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించనున్నట్టు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కొత్తగూడెంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల ఈ విద్యుత్ ప్లాంటు నిర్మాణం వలన పదివేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. కొత్తగూడెం టౌన్ షిప్ అభివృద్ధి చెందుతోంది కాబట్టి జాగ్రత్తగా నగరాభివృద్ధిని తీర్చిదిద్దాలని తెలిపారు.దీంతో విద్యుత్ సమస్యా తీరుతుందన్నారు. నల్లగొండి జిల్లా నార్కట్‌పల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్యను ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్య కళాశాలతో కూడిన ఆస్పత్రిని నిర్మించాలని సూచించారు.
చెరువుల పునరుద్దరణకు యాక్షన్ ప్లాన్
రాష్ట్రంలో పూడికతో పేరుకుపోయిన చెరువుల పునరుద్దరణపై తెలంగాణ సర్కారు దృష్టిసారించింది. ఇప్పటికే అధికారులతో చర్చించి కార్యాచరణకు సిద్దం చేసింది. దీనికి అనగుణంగా వచ్చే డిసెంబర్ నెల నుంచి చెరువుల పూడికతీతను ప్రారంభించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్దరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఈ పునరుద్దరణ పనుల్లో ప్రజలంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సీఎంతో పాటు ప్రతీ పాఠశాల విద్యార్థి పాల్గొనాలని అన్నారు. ఏడాదికి 9060 చొప్పున చెరువులు పునరుద్దరించాలని అన్నారు. కల్వకుర్తి, కొయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలన్నారు. జూరాల, పాకాల ఎత్తిపోతల ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని కోరారు. సవిూక్షలో మంత్రి హరీష్ రావుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.




