ఇవ్వలేకపోతే కారణాలు చెబుతాం
స్విస్ బ్యాంకు
హైదరాబాద్, అక్టోబర్ 15 (జనంసాక్షి) : నల్లడబ్బుపై తగిన సమాచారమిస్తామని స్విస్ అధికారులు తెలిపారు. బ్లాక్‌మనీపై సమాచారం ఇవ్వలేకపోతే కారణాలు చెబుతామని అన్నారు. స్విస్‌బ్యాంకుల్లోని భారత్‌కు సంబంధించిన నల్లధనంపై నిర్ణీత సమయంలో సమాచారమిస్తామని తెలిపారు. భారత్ అధికారులతో స్విస్ అధికారుల సమావేశం జరిగింది. భారత్ ప్రాధాన్యాల మేరకు సమాచారమందిస్తామని వారు వెల్లడించారు. ఒక వేళ సమాచారమివ్వకుంటే వివరాలు వెల్లడిస్తామన్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెస్తామని నరేంద్రమోడీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం చాలా ప్రభావం చూపింది. బీజేపీని ఇరకాటంలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని సోనియా ‘నల్లధనం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు. నల్లధనం మాటేమిటని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మహారాష్ట్ర ఎన్నికల సమరంలో సంధించిన అస్త్రం ఇది. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించడమే నా ప్రధాన లక్ష్యం అంటూ మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానమే ఆయన గెలుపునకు కారణం కావచ్చు. కాబట్టే బీజేపీని, మోదీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందవచ్చని సోనియా తాపత్రయం. యూపీఏ ప్రభుత్వంపైకి ఎల్‌కే.ఆద్వానీ, మోదీలు సంధించిన అస్త్రాన్నే ఆమె కూడా అందుకున్నారు. మోదీ ప్రభుత్వం నల్లధనం గుట్టు రాబట్టడానికి ‘సిట్’ను ఏర్పాటుచేసిందని ఘనంగా చెప్పుకోనవసరం లేదు. సుప్రీంకోర్టు విధించిన గడువే కారణం. ‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తెప్పించాల’ని కోరుతూ 2009లో రామ్‌జెఠ్మలానీ తదితరులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ బ్యాంకుల్లో డబ్బును అక్రమంగా దాచుకున్న వారి పేర్లను వెల్లడించండి’ అంటూ 2011 జనవరిలో సుప్రీం మధ్యంతర ఉత్తర్యులను జారీచేసింది. ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో 2011 జూలై 4న కోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దానికి మాజీ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి నేతృత్వం వహించాలని నిర్దేశించింది. సిట్ కేవలం జీవన్‌రెడ్డికి మాత్రమే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించాలని జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఎస్ నిజ్జార్‌లు సూచించారు. ఇలాంటి నేరాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతగా భావిస్తున్నాం అని కోర్టు నిష్కర్షగా పేర్కొంది. ప్రభుత్వం దాన్ని అవమానంగా భావించి ఇది ప్రభుత్వ అసమర్థత కిందికి రాదు అంటూ అప్పీలుకు వెళ్లింది. ఈలోగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ అల్తమస్ కబీర్ నియమితులయ్యారు. నిజ్జార్‌కు భిన్నంగా ఆయన ప్రభుత్వ వాదనతో ఏకీభవించ డంతో ‘మూడవ అభిప్రాయం’ కోసం అది పైకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకునే ఆశల్లేని సోనియా యూపీఏ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్‌లోని ‘లిచ్ టెనిష్టియన్ బ్యాంక్’ ఇచ్చిన 26 మంది పేర్లను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఇది రాబోయే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి వేసిన ఎత్తుగడే. ప్రపంచ అక్రమార్జనాపరుల స్వర్గసీమ స్విట్టర్లాండ్‌లో 312 బ్యాంకులున్నాయి, వాటికి 3,120 శాఖలున్నాయి. వివిధ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కోరితే సంబంధిత ఖాతాదారుల వివరాలను వెల్లడించాలనే నిబంధన ఇటీవలి కాలంలో అక్కడ అమల్లోకి వచ్చింది. నల్లధనం వెలికితీతపై సిట్ ఏర్పాటుకు సుప్రీం తుది గడువు 2014 మే 29. దీంతో మోదీ మే 28 మంత్రివర్గ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఎమ్‌బీ షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేశారు. దానికి చైర్మన్ జస్టిస్ జీవన్‌రెడ్డి. బీజేపీకి చెందిన రామ్‌జెఠ్మలానీ పిటీషన్ వేసి ఐదేళ్లు నిండాయి. సిట్‌ని నియమించాలని సుప్రీం ఆదేశించి మూడేళ్లయింది. హడావుడిగా ‘సిట్’ను నియమించి ఐదు నెల్లు గడుస్తున్నా దాని అతీగతీ మోదీకి పట్టలేదు. సుప్రీంకోర్టు నల్లధనంపై కొరడా విసరడానికి ముందు స్విట్టర్లాండ్‌లోని మన నల్లధనం 5లక్షల కోట్ల డాలర్లు కాగా, ప్రస్తుతం అది 5వేల కోట్ల డాలర్లకు చిక్కిపోయిందని అంచనా! మిగిలిన ఆ నాలుగు రాళ్లూ ‘సిట్’ దర్యాప్తు చేసి స్వయంగా ఖాతాదార్ల పేర్లు కనిపెట్టేసరికి మిగలవు. నల్లడబ్బు నినాదం పూర్తిగా ఎన్నికల నినాదంగానే శాశ్వతంగా మిగులుతోంది.





