టీఎస్ సర్కారుతో సహకరిస్తాం : రఘురాం రాజన్
హైదరాబాద్, అక్టోబర్ 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ కితాబిచ్చారు. తెలంగాణ సర్కారుకు అన్నివిధాల సహకరిస్తామని ఆయన తెలిపారు. రెండ్రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన భారతీయ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ బుధవారం బిజీబిజీగా గడిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో సమావేశమయ్యారు. ఆర్థిక పరిస్థితి, రుణమాఫీ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో రైతు రుణమాఫీ, రాష్ట్రంలో పరిస్థితులు, రుణ పంపిణీ తదితర కీలక అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలను కేసీఆర్ రాజన్‌కు వివరించారు. రాష్ట్రంలో సుమారు రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నామని, తొలి విడతగా రూ.4,250 కోట్లు విడుదల చేశామని తెలిపారు. మిగతా సొమ్మును కూడా దశల వారీగా బ్యాంకులకు అందజేస్తామని చెప్పారు. రుణమాఫీ, పంట రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్‌బ్యాంకు కొర్రీలు వేయడంపై ఈ సందర్భంగా కేసీఆర్ తన అసంతృప్తిని వెల్లడించారు. రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతోనే తాము రుణమాఫీ పథకాన్ని ప్రకటించామని.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమలు చేసి తీరతామని స్పష్టంచేసినట్లు తెలిసింది. రుణమాఫీ సహా సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరారు.





