వ్యవస్థలో సమూల మార్పులు
‘శ్రమేవ జయతే’ను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 (జనంసాక్షి) : ఈ-గవర్నెన్స్ ద్వారానే సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టంచేశారు. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రమేవ జయతే పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. అంతకుముందు మోడీ శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలు శ్రమ సువిధ పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ సత్యమేవ జయతే ఎంత శక్తిమంతమో.. శ్రమేవ జయతే అంతే శక్తిమంతమని అభివర్ణించారు. దేశంలో ఐటీలను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాశ్వత ఖాతా సంఖ్య వల్ల ఉద్యోగి ఎక్కడకు వెళ్లినా అదే సంఖ్య కొనసాగుతుందని తెలిపారు. కూలీలు, కిందిస్థాయి ఉద్యోగుల పట్ల ఉన్న దృక్పథాన్ని మారుస్తామని స్పష్టంచేశారు. ఈ గవర్నెన్స్ ద్వారానే పారదర్శక పాలన సాధ్యపడుతుందని తెలిపారు. పాలకులకు మాత్రమే అన్ని తెలుసు అని అనుకుంటే అది పొరపాటని అన్నారు. కార్మికుల సమస్యలను వారి కోణంలోనే చూడాలని సూచించారు. ప్రతి వస్తువు నిర్మాణం వెనుక పేదవాడి కష్టం ఉంటుందని, దేశానికి వారే నిర్మాతలు అని అన్నారు. నైపుణ్యం కలిగిన యువతను మనం ఇప్పటి నుంచే తయారు చేద్దామని పిలుపునిచ్చారు. 2020 నాటికి ప్రపంచంలో నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఒకప్పుడు ధ్రువపత్రం కావాలంటే గెజిటెడ్ అధికారి సంతకం కావాలి.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చివేశామని చెప్పారు. వ్యక్తిగత పూచీకత్తుతోనే ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లోనే అందజేస్తున్నామని తెలిపారు. మన యువతకు ఉద్యోగం కావాలి.. పారిశ్రామికవేత్తలకు పనిచేసేవాళ్లు కావాలని స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సఫలీకృతం కావాలని మోడీ ఆకాంక్షించారు. ఇది సఫలీకృతం అయితే, భారత్‌లో వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమంలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. మనకు కావాల్సిన మానవ శక్తి ఉందని.. కానీ నైపుణ్యమే కొరవడిందన్నారు. అందుకే భారత్ నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాము కార్మిక సమస్యలను తాము శ్రామికులుగానే చూస్తాం తప్పితే పెట్టుబడిదారులుగా చూడమని వ్యాఖ్యానించారు.





