Tuesday, 3 November 2026

సమ్మె ఉధృతంచేసిన జూనియర్‌ డాక్టర్లు

Junior-doctors-strike(1)
అత్యవసర సేవల నిలిపివేత

హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : జూనియర్‌ డాక్టర్లు సమ్మె ఉధృతం చేశారు. అత్యవసర సేవలు నిలిపివేశారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్‌ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జూడాలు అత్యవసర సేవలు నిలిపివేసి సమ్మె కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఏడాది పాటు తాత్కాలిక వైద్య సేవలు అందించాలన్న జీవోను రద్దుచేయాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. గ్రామాల్లో కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన కాకుండా రెగ్యూలర్‌గా అయితే వైద్య సేవలు అందిస్తామని జూడాలు చెబుతున్నారు. జూడాల సమ్మెలతో రోగులు తీవ్ర ఇబ్బందులు గాంధీ ఆసుపత్రిలో 17రోజులుగా జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది. బుధవారం  నుంచి అత్యవసర సేవలనూ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత ఆసుపత్రి ఎదుట చెవుల్లో పువ్వులు పెట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం రోడ్డువిూదకు వచ్చి రాస్తారోకో చేయడంతో సికింద్రాబాద్‌ నుంచి ముషీరాబాద్‌ వైపు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కొందరు జూడాలు నోట్లో బ్లేడులు పెట్టుకుని నిరసన వ్యక్తంచేశారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకునేందుకు ఓ సంచిలో సీసాలను తీసుకురాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా పక్షం రోజుల నుంచి వీరు తాము చేస్తున్న ఆందోళన కొనసాగిస్తూ సర్కార్‌తో జరిపిన చర్చలకు అంగీకరించలేదు. పూర్తిస్థాయి గ్రావిూణ సేవలకు తాము సిద్ధంగా ఉన్నామని జూనియర్‌ వైద్యులు స్పష్టం చేస్తూనే, పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇస్తేనే వెళతామన్నారు.  చిత్తశుద్ధితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగాలేదని విమర్శించారు. ఇదిలావుంటే వీరి సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య చర్చించారు. సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయినా వీరు పట్టించుకోలేదు. దీంతో సమ్మె యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేసే పక్రియ ప్రారంభమైందని మంత్రి  చెప్పారు. రోగులకు నాణ్యమైన సేవలందించే క్రమంలో ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు. జూడాల సమ్మెపై కూడా మంత్రి తీవ్రంగానే స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన వైద్య సేవలను జిల్లాలు, డివిజన్లు, నియోజకవర్గాలు, మండలాల స్థాయికి వికేంద్రీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ప్రజలు అత్యధికంగా హైదరాబాద్‌లోని ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారన్నారు.  గ్రామాల్లో మరింత మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో త్వరలోనే మరో 2వేల మంది ఏఎన్‌ఎంలను నియమించనున్నట్లు తెలిపారు. ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రి మంజూరు విషయంపై చర్చించడానికి త్వరలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను కలవనున్నట్లు మంత్రి చెప్పారు. ఆంధప్రదేశ్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్యులను వెంటనే వెనక్కి రావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. జూడాలు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమైందన్నారు. ఏడాది పాటు గ్రావిూణ వైద్య సేవలు తప్పనిసరి చేయాలన్నది చట్టంగా ఉందని, దీన్ని మార్చాలంటే శాసనసభలోనే సాధ్యమని రాజయ్య తెలిపారు. పైగా ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, జూడాలు మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని మంత్రి కోరారు. అయితే వీరు ఇందుకు ముందుకు రాకుండా సమ్మెను ఉధృతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *