కొత్తగా వెయ్యి ఆర్టీసీ బస్సులు కొంటాం
సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 16 (జనంసాక్షి) : ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కొత్తగా వెయ్యి ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల పల్లెవాసుల నుంచి పట్నం వాసుల వరకు అందరికీ రవాణా అవసరాలను తీరుస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ఆధునీకరించడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. కొత్తగా ఆర్‌టిసి కి 1000 బస్సులు సమకూర్చాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలో రవాణా వ్యవస్థపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ జగదీశ్, రవాణా శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఆర్‌టిసి ఎండీ పూర్ణచందర్‌రావు, జెఎండి రమణారావు, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంంగిడి సునీత, పైల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగకు ముందు ఆర్టీసికి ప్రభుత్వం రూ.250 కోట్లు అందించింది. గురువారం నాటి సమావేశంలో రూ.150 కోట్లను ఆర్‌టిసికి కొత్త బస్సులు కొనుగోలు కోసం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో మొత్తంగా రూ.400 కోట్లు ఆర్‌టిసికి ఇచ్చింది. ఇప్పటికే 350 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం గురువారం జరిగిన సమావేశంలో మరో 650 బస్సులను కొత్తగా సమకూర్చాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో నడిపేందుకు 400 బస్సులు, 100 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 50 ఇంద్ర, గరుడ తరహాలో వోల్వో బస్సులు కొనుగోలు చేయాలని, వీటితోపాటు ఆర్‌టిసికి ప్రైవేట్ బస్సులను అనుమతిస్తామన్నారు. మొత్తంగా 1000 కొత్త బస్సులు రెండుమూడు నెలల్లో రోడ్లపై తిరుగుతాయని చెప్పారు. అందమైన, ఆకర్షణీయమైన రంగుల్లో ఈ బస్సులు అన్ని ప్రాంతాల్లో కలియతిరుగుతూ కొత్త శోభ తెస్తాయన్నారు. మార్చి తరువాత మరో 1000 బస్సులు కూడా కొంటామని వెల్లడించారు. తెలంగాణ ఆర్‌టిసిలో 2000 బస్సులు రీప్లేస్‌మెంట్ జరుగుతుందన్నారు. ఆర్‌టిసి కోసం నడిచే అద్దె బస్సులకు వ్యాట్ మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదన పట్ల కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లకు తగు శిక్షణనిచ్చి పర్మనెంట్ చేసే విషయంలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ నగరంలో 4000 ఆర్టీసి బస్సులు నడుస్తున్నందున ఇక్కడ నిర్వహణ సామర్థ్యం పెంచేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రెండు రీజినల్ మేనేజర్ల పోస్టులను కూడా ముఖ్యమంత్రి మంజూరుచేశారు. ఆర్‌టిసిని లాభాల బాట పట్టించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. డిపోల వారిగా పరిస్థితిని అధ్యయనం చేసి ఆయా డిపో మేనేజర్లు ఆర్‌టిసి ఎండీకి నివేదిక సమర్పించాలన్నారు. దాని ప్రకారం రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో రవాణా శాఖ కమిషనర్, డిటిసిలు, ఇతర ముఖ్య అధికారులు మరోసారి సమావేశమై ఆర్‌టిసి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలన్నారు. మూడవ దశలో తానే స్వయంగా ఆర్‌టిసి అధికారులందరితో సమావేశం అవుతానని సీఎం చెప్పారు. ఆర్‌టిసి ఎండీ, ఇడిలు, ఆర్‌ఎంలు, డివిజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, డిటిసిలు, జాయింట్ కమిషనర్లు, ఆర్‌టిఓలు, ఎంవిఐలు, అసిస్టెంట్ ఎంవిఐలతో తాను నేరుగా మాట్లాడి ఆర్‌టిసి లాభాల దారిలోకి తెచ్చేందుకు చర్చిస్తానన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. 0.08 అక్సిడెంట్ రేషియోతో అఖిలభారత స్థాయి రికార్డు నెలకొల్పిన ఆర్‌టిసిలో ప్రమాదాల శాతాన్ని మరింత తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి రోజు 10,000 బస్సులు 90లక్షల మందికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ, 63.5వేల మంది ఉద్యోగులను కలిగియుండి దేశంలోనే నెంబర్ 1 రోడ్డు రవాణా సంస్థగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిలుస్తుందని చెప్పారు. ఆర్టీలో 72శాతం అక్యుపెన్సీ రేషియో ఉందని, దీన్ని మరింత పెంచాలని సీఎం సూచించారు.





