జూపల్లి, కొప్పుల, తుమ్మల, లక్ష్మారెడ్డికి చోటు
హైదరాబాద్, అక్టోబర్ 16 (జనంసాక్షి) : తెలంగాణలో ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న విస్తరణ ఉంటుందనే సంకేతాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ విస్తరణ యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ విస్తరణలో జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ దఫా విస్తరణలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్య కల్పించే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి కృష్ణారావు, జడ్చర్ల నుంచి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే తుమ్మలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి అనంతరం మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్ నేతలు మంత్రి పదవి కోసం తమవంతుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు విస్తరణ కార్యక్రమానికి పూనుకుంటారా? అని ఎదురుచూస్తున్న ఆశావహులకు దీపావళి కానుకగా విస్తరణలో అవకాశం దక్కనుంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే సంకేతాలు ఇటీవల వెలువడ్డాయి. కొందరు మంత్రుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే వారిని తొలగిస్తారా? లేక కొనసాగిస్తారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఏదిఏమైనా కొత్తవారికి సీనియర్లయిన వారికి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతున్నట్లుగా భావించవచ్చు.








