Tuesday, 3 November 2026

అన్నంపెట్టే రైతన్నకు రుణమాఫీ చేస్తే తప్పా?

court
రుణమాఫీ వద్దన్న

పిటిషనర్‌ను తలంటిన హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 20

(జనంసాక్షి) :

అన్నంపెట్టే అన్నదాతకు రుణమాఫీ చేస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. రుణమాఫీ వద్దన్న పిటిషనర్‌ను కోర్టు తలంటింది. రైతు రుణమాఫీ చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేస్తే తప్పేమిటని పిటిషనర్‌ను సూటిగా ప్రశ్నించింది. రైతులు లేకపోతే మనం లేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టంచేసింది. రైతుల రుణమాఫీ చట్టవిరుద్ధమని, తక్షణమే రుణమాఫీపై స్టే విధించాలని కోరుతూ లోక్‌సేవ అనే సంస్థ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. రైతు రుణమాఫీ సరికాదని, దానివల్ల బ్యాంకులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు రైతులు తిరిగి చెల్లించే విధానాన్ని కోల్పోతారని పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ చట్ట విరుద్దమని ప్రకటించడంతో తక్షణమే రుణమాఫీపై స్టే విధించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేస్తే తప్పేమిటని ప్రశ్నించింది. రైతు రుణమాఫీ సరికాదన్న పిటిషనర్‌ వ్యాఖ్యలపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దుస్తులిచ్చే నేతన్నలు, ఇళ్లుకట్టే తాపీ మేస్త్రీలకు సహకరిస్తే తప్పేంటంటూ సూటిగా ప్రశ్నించింది. సామాజిక ఆలోచన దృక్కోణం ఎందుకు మారడంలేదని పేర్కొంది. రైతులు లేకపోతే మనం కూడా లేమని వ్యాఖ్యానించింది. అప్పుల బాధతో పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేసిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది. సామాజిక దృక్కోణం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కోటీశ్వరులు, సామాన్యులు సమాన స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నారని గుర్తుచేసింది. రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల వారు రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందుతారని తెలిపింది. వినోదం కోసం చాలా మంది కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని.. పేద రైతులకు రుణమాఫీ చేస్తే తప్పేమిటని నిలదీసింది. రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం సరైనదా.. కాదా? అన్న విషయాన్ని తాము చర్చించట్లేదన్న కోర్టు.. రుణమాఫీ వల్ల పేద రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. సమగ్ర వివరాలతో మరోమారు పిటిషన్‌ వేయాలని ఆదేశిస్తూ.. పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *