Monday, 2 November 2026

హర్యానా సీఎం అభ్యర్థిగా మనోహర్‌లాల్‌

haryana

చండీగఢ్‌, అక్టోబర్‌ 21(జనంసాక్షి) : హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఎన్నికయ్యారు. మంగ ళవారం ఇక్కడ సమావేశమైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఖట్టర్‌ను ఎన్నుకున్నారు. దీనికి పరిశీలకుడిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. హర్యానాలో ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు ఆయనను ఎన్నుకున్నారు. హర్యానాలో ఏర్పడిన తొలి బిజెపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఖట్టర్‌కు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడైన ఖట్టర్‌ గతంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.ప్రచారక్‌ గా పనిచేశారు. ఈయన బ్రహ్మచారి. 60ఏళ్ల వయసున్న ఖట్టర్‌ను పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎంపికచేశారు. ఇప్పటికే ఓడిషా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడులలో పెళ్లికాని ముఖ్యమంత్రులు ఉండగా, తాజాగా మరో ముఖ్యమంత్రి ఆ జాబితాలో చేరుతున్నారు. పరిశీలకుడిగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సవిూకరణాలు మారిపోయాయి. ఇప్పటి వరకు జాట్‌ వర్గీయులకే సీఎం సీటు అప్పగిస్తారని ప్రచారం జరగ్గా తాజాగా కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. జాట్‌ వర్గీయులకు కాకుండా వేరే వాళ్లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి రేసులో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పేరుముందుకు వచ్చింది.ఖట్టర్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయని సమాచారం. అయితే అందరినీ సంప్రదించి ఏవాభిప్రాయంతో సిఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఖట్టర్‌  కర్నాల్‌ స్థానం నుంచి గెలుపొందారు. 1980 నుంచి 1994 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తిస్థాయిలో పనిచేసిన ఖట్టర్‌, ఆ తర్వాత బీజేపీలో చేరారు. ముందునుంచి ప్రధాని నరేంద్రమోదీకి ఈయన అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. 60 ఏళ్ల వయసున్న ఖట్టర్‌.. ఇప్పటికీ బ్రహ్మచారే. తొలుత కెప్టెన్‌ అభిమన్యు పేరును ముఖ్యమంత్రి పదవికి గట్టిగా పరిశీలనలోకి తీసుకున్నట్లు వినిపించింది.  కానీ, వ్యూహం మార్చుకున్న నేతలు ఖట్టర్‌ పేరు ముందుకొచ్చేలా చేశారు.  దీంతో హర్యానాలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పదవి చేపట్టే అవకాశం ఖరారయ్యింది. గత ఎన్నికల్లో హర్యానాలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఈసారి ఏకంగా 47స్థానాల్లో పాగా వేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 మాత్రమే. అంత చిన్న రాష్ట్రంలో ప్రచారం కోసం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి తొమ్మిదిసార్లు వచ్చారని, ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారా అని కూడా ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హూడా ఎద్దేవా చేశారు. కానీ ఎవరేమన్నా.. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *