Tuesday, 3 November 2026

ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలపై టాస్క్‌ఫోర్సు కొరడా

రికార్డులు స్వాధీనం, యాజమాన్యాలపై కేసులు

రంగారెడ్డి,జనవరి8(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా  పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో టాస్క్‌ ఫోర్స్‌  పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ తదితర ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా కాలేజీలు నడుస్తున్నాయని గుర్తించారు. తప్పుడు పత్రాలు చూపి మోసం చేశారంటూ పలువురు విద్యార్థులు జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ ఎన్వీరావుకు లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సైబర్‌బాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని కృష్ణమూర్తి ఇంజనీరింగ్‌ కాలేజ్‌, కొమ్మూరి .ప్రతాప్‌రెడ్డి కాలేజ్‌, ప్రిన్స్‌టౌన్‌ కాలేజ్‌, సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఈ నాలుగు కళాశాలలను కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలేజీలపై చీటింగ్‌ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో తప్పుడు పత్రాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ఫీజు రియంబర్స్‌మెంట్‌ వ్యవహారాల్లోనూ అవకతవకలు ఉన్నాయని గుర్తించారు.  నాలుగు ఇంజినీరింగ్‌ కాలేజీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులు, ప్రభుత్వాన్ని మోసం చేశారని కేసు పెట్టనట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌  తెలిపారు. కృష్ణమూర్తి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఆండ్‌ టెక్నాలజీ, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రిన్స్‌టన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ వుమెన్‌, సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలపై కేసులు నమోదు చేశారు. విజిలెన్స్‌ తనిఖీలకు వచ్చినప్పుడు నకిలీ విద్యార్థులను, లెక్చరర్లను చూపించినట్లు ఈ కాలేజీలపై అభియోగం మోపారు. పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కళాశాలల్లో బోధనా రుసుముల దస్త్రాలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, చేవెళ్లలోని కళాశాలల్లో దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ అధికారులు, పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఖమ్మం పాల్వంచలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో తనిఖీలు చేపట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా కోదాడ కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు జరిపారు. యాజమాన్యం బోధనా రుసుములు స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు.
3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *