తెలుగుభాషను రక్షించుకోవాలి

కర్నూలు : ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కర్నూలు జిల్లా యంత్రాంగం కందనవోలు తెలుగు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కన్నబాబు నేతృత్వంలో తెలుగులో రాద్దాం… తెలుగులో సంతకాలు చేద్దాం…తెలుగును అభిమానిద్దాం అన్న నినాదంతో మాతృభాష అమలు కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వాణిజ్య, గృహసముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు తెలుగులోనే పేర్లు రాయాలని ప్రజలను చైతన్యవంతులను చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి చైతన్య యాత్ర చేపట్టారు. వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి మాతృభాష ఆవశ్యకతను వివరించారు. దుకాణాల పేర్లను ఇకనుంచి తెలుగులోనే రాయాలన్నారు. అలా సూచికలు రాసిన రాసిన వారికి పూలు,ప్రపంచ మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఆంగ్లంలో పేర్లురాసిన వారికి ఆహ్వాన పత్రాన్ని మాత్రమే ఇస్తూ.. ఇక నుంచి ఆంగ్లం బదులు తెలుగు రాయాలని సూచించారు. నెలరోజుల్లో సూచికలన్నీ మార్చుకోవాలని వ్యాపారులను కోరారు.