తిరుపతి, నవంబర్ 22 :రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్ అవినీతి పాలనే మూలమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంత్రులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుంటే.. ఈ ప్రభుత్వంలో ఎంత అవినీతి దాగుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ, అవినీతి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో అనిశ్చితి తొలగిపోతుందని ఆయన చెప్పారు. గురువారం ఉదయం తిరుపతిలో నారాయణ విూడియాతో మాట్లాడారు. మద్యం సిండికేట్లపై విజిలెన్స్ నివేదిక రాజకీయ పక్షపాతంగా ఉందని మండిపడ్డారు. సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా లంచాలు తీసుకుంటుంటే.. ఆధారాలు లేవనడం సరికాదన్నారు. బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ లాంటి వారి పేర్లు గతంలో బయటకు వచ్చాయని, కానీ, ఏసీబీ నివేదికలో మాత్రం ఆ పేర్లు గల్లంతయ్యాయన్నారు. ఏసీబీ నివేదిక పూర్తి రాజకీయ పక్షపాతంతో ఉందని, తాము గుర్తించడం లేదన్నారు. కేవలం అధికారులను బలిపశువులను చేసి, రాజకీయ నాయకులను తప్పించడంపై మండిపడ్డారు. సిండికేట్ల ఈ వ్యవహారంలో రాజకీయ తిమింగలాల పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రులు వైఎస్సార్ మంచివాడని, జగన్ అవినీతిపరుడని ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం డిసెంబర్ 10న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. హంద్రీనీవా కోసం పోరాడిన పెద్దలతో డిసెంబర్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో అనిశ్చితికి తెలుగుదేశం పార్టీ కూడా కారణమని పేర్కొన్నారు. తెలంగాణ, అవినీతిపై స్పష్టమైన విధానం అవలంబించకుండా ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, అవినీతిపై స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే టీడీపీలో గందరగోళం నెలకొందని నారాయణ తెలిపారు. పార్టీ నేతల్లో అసంతృప్తి, అభద్రతా భావం నెలకొందని, అందుకే వలసలు పెరిగాయని అన్నారు. టీడీపీ ఇప్పటికైనా స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.




