గుంటూరు: అవినీతి మంత్రులను కేంద్రం తొలగించడంలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పిఎంఓలో నివేదికను ట్యాంపరింగ్ చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు. అవినీతి మంత్రులను తొలగించడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మంట కలిసినా పట్టించుకునే నాథుడు లేడని ఆవేధన వ్యక్తం చేశారు. కోల్గేట్ వ్యవహారంలో సాక్ష్యాలను తారుమారు చేసి పెద్దమనుషులను వదిలేశారన్నారు. జగన్ బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ అత్యాచారం చేసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించడం లేదన్నారు. ఎన్టీఆర్‌ను చంపిన చంద్రబాబు, ఆయన విగ్రహాప్రతిష్టాపనకు వెళ్లడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సీబీఐను చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు. సీబీఐ వ్యవహారం బయటకు వచ్చినా ఆయన నోరు ఎత్తకపోవడానికి కారణమేంటీ? అని అడిగారు.
మంత్రి శైలజానాథ్: వ్యవహారంపై కాంగ్రెస్ నేతల ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ నేతలు కొణతాల రామకృష్ణ, కొండా సురేఖలపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఎల్లోమీడియా యత్నాలు సఫలం కావన్నారు.




