ఏలూరు,మార్చి26 (జనంసాక్షి) : రేషన్ డీలర్లు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. ఈనెల 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్ల కార్యాలయాల వద్ద డీలర్లు నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో చేసిన తీర్మానాలను ఈనెల 27న రాష్ట్ర పౌర సరఫరాల కమిషనరుకు అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే 6 వేల రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానం అమలవుతున్న రేషన్ దుకాణాలకు సంబంధించిన డీలర్లు నెలకు రూ.3000 చొప్పున సొంత ఖర్చులను భరించాల్సి వస్తోందన్నారు. రేషన్ డీలర్లు ఏప్రిల్ 15 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నారు.రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పత్రి డీలరుకు నెలకు కనీసం 15 వేల చొప్పున ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నేటికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదని సంఘం నాయకులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లంతా ఏప్రిల్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని తీర్మానించినట్లు వెల్లడించారు.




