హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): రైతు సమస్యలపై చర్చించాలని కోరుతూ వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆంధప్రదేశ్ శాసనసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. రైతు సమస్యలపై సరైన సమయంలో చర్చిద్దామని సభాపతి కోడెల శివప్రసాదరావు సూచించినా వైకాపా పట్టువీడక పోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆంధప్రదేశ్ శాసనసభ బ్జడెట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని కోరుతూ వైకాపా సభ్యులు ఆందోళనకు దిగారు. వివిధ సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని విపక్ష నేత జగన్ అన్నారు. ఏ అంశమైనా చర్చకు సిద్దమని యనమల ప్రకటించారు. ఆంధప్రదేశ్ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు రైతు సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష నేత జగన్ పట్టుబట్టారు. బీఏసీలో తాము లేవనెత్తిన అంశాలపై ఎప్పుడు చర్చిస్తారో చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. నలభై రోజులు ఉండవలసిన శాసనసభ సమావేశాలను పదిహేడు రోజులలో ముగించడం సమంజసం కాదని జగన్ అన్నారు. రైతుల బాధలు, సమస్యల గురించి చర్చించాలని అడిగితే మైక్ కట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాసనసభ పది నిమిసాల పాటు వాయిదా పడి తిరిగి ఆరంభమైన తర్వాత మాట్లాడుతూ రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయటం సమంజసమేనా అని ఆయన అన్నారు. సమయం అడగటం కూడా తప్పు చేసినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడాతూ బీఏసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై తాము చర్చకు సిద్ధమేనని తెలిపారు.
ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా
ఆంధప్రదేశ్ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మృతికి శాసనమండలి సంతాపం తెలిపింది. అనంతరం శాసనమండలి సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి లద్ఘిర్మన్ చక్రపాణి ప్రకటించారు.




