Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌,వైకాపాలపై మాజీ మంత్రి ‘కళా’ విమర్శ

కవిటి, జనంసాక్షి : 2014 ఎన్నికల అనంతరం వైకాపా కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ పరిశీస్తే.. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం బట్టబయలైందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రామయ్యపుట్టుగలో విలేకరులతో మాట్లాడారు. తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా, తెరాసలు ఆవిశ్వాసం విషయంలో ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నాయో రాజకీయ పరిజ్ఞానం ఉన్న చిన్నపిల్లాడ్ని అడిగినా చెబుతాడన్నారు. ఆవిశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ను జైలు నుంచి విడిపించుకోవడానికి ఇదో ప్రయత్నమన్నారు. ఈ కుటిల ప్రయత్నాలను తెదేపా అడ్డుకొని తీరుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.500 కోట్ల మూలధనం విద్యుత్తు సంస్ధలకు చెల్లించి ఉంటే రాష్ట్రం ఈ రోజు అంధకారంలో మగ్గాల్సిన దుస్ధితి ఉండేది కాదని తెలిపారు. జలయజ్ఞం పేరిట రూ. 90 వేల కోట్ల బిల్లులు చెల్లింపులు జరిగాయని, ఎన్ని ఎకరాలకు సాగునీరందించారో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్‌, నేతలకు ఉందా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు మేలు చేకూర్చే తోటపల్లి, వంశధార ప్రాజెక్టు పనులు 2007 నాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీలో వైఎస్‌ చెప్పారని, ఇప్పుడు అవి ఏ పరిస్థితిల్లో ఉన్నాయో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని ‘కళా’ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *