Wednesday, 4 November 2026

కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటన

చిత్తూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 24, 25వ తేదీల్లో మరోమారు జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే నీరుచెట్టు కార్యక్రమం కోసం వచ్చిన బాబు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  కుప్పం పర్యటన ఖరారైన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్న ప్రాంతాలను ఎస్పీతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం పరిశీలించింది. ఇంజినీరింగ్‌ కళాశాల, స్థానిక బస్టాండులో బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని, పంచాయతీ కార్యాలయ ఆవరణాన్ని, ద్రవిడ వర్సిటీ, పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రిలయన్స్‌ 4జీ టవరును ప్రారంభించనున్నారు. ఇదిలావుంటే తెదేపాకు సైనికుల్లాంటి కార్యకర్తలు, అంకితభావంతో పనిచేసే క్యాడరు ఉందని అదే పార్టీకి బలమని చంద్రగిరి పరిశీలకులు, జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు పుష్పావతి అన్నారు. జిల్లాలో   ప్రతి ఒక్కరూ   పార్టీ పటిష్ఠతకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. గత పదేళ్లుగా అధికారంలో లేకున్నా, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదురరైనా దేనికీ వెరువక పార్టీ వెంట ఉన్నారన్నారు. అలాంటి వారిని విస్మరించకూడదనే ఉద్దేశంతో యువ నాయకుడు నారా లోకేష్‌ కార్యకర్తల సంక్షేమం కోసం కొత్త విధానానికి రూపకల్పన చేశారన్నారు. ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇది ఉన్న సభ్యుడిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *