Tuesday, 3 November 2026

కోటి మొక్కలు నాటడమే లక్ష్యం

కడప,మార్చి2(జ‌నంసాక్షి): నీరు – చెట్టు కార్యక్రమం ద్వారా జిల్లాలో కోటి మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా నీటియాజమాన్యసంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.  నీరు – చెట్టు కార్యక్రమానికి గ్రామాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు తయారుచేసి తమకు నివేదిక అందించాలని కోరారు. ఇందుకు ఉపాధి సిబ్బంది సహకరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధి సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించి సవిూక్షించారు.ప్రతి గ్రామంలో పనులు ప్రారంభించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూలీల సంఖ్యను కూడా పెంచాలని పేర్కొన్నారు. ఇదిలావుంటే ‘నీరు-చెట్టు’ పథకంలో భాగంగా జిల్లాలో ఉన్న చెరువుల్లో పూడికతీత పనులకు రూ.5 కోట్లు మంజూరు చేస్తూ నీటిపారుదలశాఖ రాష్ట్ర కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకుగాను రూ.65 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఒక్కొక్క జిల్లాకు రూ.అయిదు కోట్లు ఇచ్చారు. కడప జిల్లాలో చిన్న, పెద్ద చెరువులు 1,841 ఉన్నాయి. వీటి పరిధిలో 1,11,225 ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ‘నీరు-చెట్టు’ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెరువుల్లో పూడికతీతను ఉద్యమంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో జిల్లాకు రూ.అయిదు కోట్లను మంజూరు చేశారు. కలెక్టరు అనుమతి మేరకు పనులు చేయాల్సి ఉంటుందని తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *