Thursday, 5 November 2026

కోర్టులోనే యువకుడి ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి, : కోర్టు ఆవరణలోనే ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్ కిషోర్(28) 2011లో ఏలూరుకు చెందిన నాగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో భర్త ప్రేమ్ కిషోర్‌పై నాగలక్షి వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు ప్రమ్ కిషోర్‌ను అరెస్ట్ చేశారు. కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. కిషోర్‌కు ఎటువంటి కట్నం ఇవ్వకుండానే.. రాజీ కోసం రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని భార్య నాగలక్ష్మి, అత్త రాజేశ్వరి కిషోర్‌ను బెదిరించసాగారు. అంతేకాకుండా కోర్టు ఆవరణలోనే పలుమార్లు కిషోర్ తల్లిని వ్యభిచారంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన కిషోర్ సోమవారం కోర్టు వాయిదాకు వస్తూ వస్తూ ఆరో పేజీల సూసైడ్ నోట్ రాశాడు. భార్య, అత్త వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుటుంబ స్తోమత నెలకు 4వేల రూపాయలు మాత్రమేనని కానీ రాజీ కోసం రెండు లక్షలు ఇవ్వమంటున్నారని మొబైల్ మెజిస్ట్రేట్‌కు నోట్‌లో వివరించాడు. తనను వేధించిన భార్య, అత్తపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్‌లో ప్రాధేయపడ్డాడు. కొద్దిసేపటి క్రితం వాయిదా కోసం మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చిన అతను అక్కడే పురుగు మందు తాగి పడిపోయాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ గమనించి వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *