ఏలూరు,మార్చి9(జనంసాక్షి): చెరువుమట్టి తవ్వకం పనులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ‘నీరు-విూరు’ పథకంలో చెరువుల పూడికతీత చేపట్టామని అధికారులు అన్నారు. ప్రభుత్వ నిధులతో యంత్రాలను సమకూర్చి మట్టిని ఉచితంగా రైతుల ట్రాక్టర్లపై పోయగా రైతులు ఆమట్టిని తరలించుకునే వారు. మూడు యంత్రాలతో తవ్వినా వాహనాలు బారులు తీరిఉండేవి. గత 10ఏళ్లలో ప్రభుత్వం ప్రభుత్వనిధులతో తవ్వించకపోగా చెరువుమట్టిన తవ్విన రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించడంతో చెరువుమట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం మరలా అవకాశం కల్పించడంతో ఎంతో సారవంతమైన చెరువు మట్టిన వ్యవసాయభూముల్లోకి తరలించుకునేందుకు రైతులు ఆసక్తిచూపుతున్నారు. వివిధ మండలాల్లోని చెరువుల వద్ద మట్టితవ్వకం పనులను ‘నీరు-చెట్టు’ పథకంలో చేపట్టారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండడం, వ్యవసాయ భూముల్లో పంటలు ఉండడం వల్ల మట్టిని తరలించడానికి రైతులు ఆసక్తి చూపకపోవడం వల్ల మట్టితవ్వకం పనులు మందకొడిగా మొదలయ్యాయి. గండిచెరువు తవ్వకం పనులు క్రమంగా ఊపందుకున్నాయి. మరికొద్ది రోజులు పోతే యంత్రాల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. రోజుకు సుమారు 300 ట్రాక్టర్ల మట్టిని రైతులు పొలాల్లోకి తరలిస్తున్నారు. పొగాకుక్యూరింగు, దాళ్వావరి కోతలు మొదలైతే గండిచెరువు మట్టికోసం వాహనాలు బారులు తీరే పరిస్థితి ఉంటుందనేది గత అనుభవాన్ని బట్టి తెలుస్తోంది.




