విజయవాడ, (జనంసాక్షి): టాలీవుడ్‌పే వదిలి వెళ్లే ఉద్దేశం లేదని ఏ మాత్రం లేదని ప్రముఖ హీరో మహేష్ బాబు స్పష్టం చేశాడు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని ఆయన వెల్లడిరచారు. విజయవాడ ఏలూరు రోడ్డులో కొత్తగా ఏర్పాటైన రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ ను మహేష్ బాబు బుధవారం ప్రారంభించారు.
అనంతరం మహైష్ బాబు విలేకర్లుతో మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడిన రెయిన్ బో హాస్పిటల్ అత్యుత్తమ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం తమ వంతు సహాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు విజయవాడతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తొలి సినిమా రాజకుమారుడి నుంచి బెజవాడతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘1 నేనొక్కడినే ’ చిత్రం టీజర్ రికార్డు బ్రేక్ చేయటం సంతోషంగా ఉందన్నారు. తన నట జీవితంతో 1 నేనొక్కడినే చిత్రం మైలు రాయిగా నిలుస్తుందని , అందులో కొత్త లుక్ తో కనిపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు వేసిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.
సినిమాలు చూసి యూత్ చెడి పోతున్నారని ఓ విలేఖరి ప్రశ్నించగా…. తానుప్పుడూ అలాంటి సినిమాలు చేయనని, తన సినిమాలు చూసి ఇప్పటి వరకు ఎవరూ చెడిపోలేదని స్పష్టం చేశారు. బాలీవుడ్లో సినిమా చేస్తున్నారట కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ , వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచన లేదని గతంలోనే చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను… మరో పదేళ్ల పాటు టాలీవుడ్ లోనే ఉంటానని ప్రిన్స్ స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని తాను ఉదో ఒకటి చెప్పేస్తే… మీరు ఏదో ఒకటి రాసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు ఆడగవద్దని విలేకర్లతో మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం జేమ్స్ బాండ్ క్యారెక్టర్లు చేసే ఆలోచన లేదని, అవి చేసి నాన్న సినిమాలు చెడగొట్టడం ఇష్టం లేదన్నారు. మంచి కథ దొరికితే మల్టీ స్టారర్లు చిత్రాలు చేయడానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు.




