
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో మైత్రిపాల సిరిసేన దంపతులు పాల్గొన్నారు. మరోవైపు.. బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న స్వామి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.
ఇదిలావుండగా, తిరుమలలో వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మహద్వారం తలుపులు తెరుచుకోలేదు. ఎంతసేపు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో ఆక్సా బ్లేడుతో కోసి తలుపులు తీశారు. దీంతో సుప్రభాత సేవ 10 నిమిషాలకు పైగా ఆలస్యమైంది. అదే సమయంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దాదాపు అక్కడే వేచి ఉన్నారు. ఇంతకీ గుడి తలుపులు ఎందుకు తెరుచుకోలేదు? తరువాత ఏం చేశారు? తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.
సాధారణంగా రాత్రి బాగా పొద్దుపోయాక స్వామివారికి పవళింపు సేవ పూర్తి చేసి గుడి తలుపులు మూసివేస్తారు. తలుపులు బాగా ఎత్తు ఉంటాయి. తాళం వేసిన తరువాత వాటిని ఆలయ అధికారులకు అప్పజెప్పుతారు. అయితే గుడి తలుపులు సన్నిధి గొల్ల వచ్చి తెరవాల్సి ఉంటుంది. యాదవ కులానికి చెంది ఆనాదిగా వస్తున్న సాంప్రదాయ కుటుంబంలోని వారు. భక్తులు వెళ్ళే సమయంలో నిలువెత్తు తలుపులు తీసేస్తారు. తలుపునకు ఉన్న తాళాలలో ఒకటి కనిపించడం లేదు. ఈ తలుపు ప్రత్యేకత ఏంటంటే సక్రమంగా తీస్తేనే తెరుకుంటాయి. లేకపోతే ఏమి చేసిన తెరుచుకోవు.
బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సమయంలో తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. అయితే అది తెరుకోలేదు. అప్పటికే అక్కడ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతోపాటు చాలా మంది భక్తులు సుప్రభాత సేవ దర్శనం కోసం వేచి ఉన్నారు. పఠనం చేసిన తరువాత తలుపులు తీసే ప్రయత్నం చేయడంతో తలుపులు మొరాయించాయి. విషయం వెంటనే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళారు.
అయితే చిన్న తలుపు ద్వారా లోనికి ప్రవేశించి ఆక్సా బ్లేడుతో గడియను కోసి తలుపులు తీసినట్లు తెలుస్తోంది. దీంతో సుప్రభాత సేవకు 10 నిమిషాలకుపై ఆలస్యమైంది. ఇదే విధంగా 1970 లలో ఒక్కమారు ఇందిరాగాంధీ వచ్చిన సమయంలో తలుపులు తెరుచుకోలేదని అంటుంటారు. దీనిపై ఈవో సాంబశివరావు ఆగ్రహం వ్యక్త చేశారు. కారణాల నిగ్గు తేల్చాలని విజిలెన్సు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.




