బాపట్ల : గుంటూరు జిల్లాలో దొంగనోట్లను తయారు చేస్తూ మార్కెట్‌లో మార్చటానికి ప్రయత్నిస్తున్న ఒక ముఠాను బాపట్ల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ భాస్కర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కొల్లిపర మండలం అన్నవరం గౌడపాలెంకు చెందిన పొన్నూరు వీర్రాజు, తూములూరు గ్రామానికి చెందిన ఈమని లక్ష్మీ శ్రీనివాసరెడ్డిలు కంప్యూటర్ ద్వారా దొంగనోట్లను ముద్రిస్తున్నారు. ఈ నోట్లను బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఒక వ్యక్తికి ఇవ్వటానికి తీసుకువస్తుండగా చీల్ రోడ్డు వద్ద ఎన్‌ఐ శ్రీనివాసరావు వారిని పట్టుకుని తనిఖీ చేశారు. వారి వద్ద రూ. లక్ష నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. నిందితులను విచారించిన అనంతరం మంగళగిరిలోని వీర్రాజు ఇంటిలో మరో రూ. 4 లక్షల 9 వేల 900 నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు పంపారు.




