విజయవాడ,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: విజయవాడలో శనివారం నుంచి రెండు రోజులపాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగనున్నాయి. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. దీనికి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, అందులో తెలంగాణ నుంచి 600 మంది ప్రతినిధులు వస్తున్నారని వివరించారు. తెలుగు భాష, ఆశ, శ్వాస ఒక్కటేనని ప్రపంచానికి చూపించడమే సభల ప్రధాన ఉద్దేశమని, మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న మూడో మహాసభలకు ఎంతో విశిష్టత ఉందన్నారు. సినీనటులు, రచయితలు బ్రహ్మానందం, తనికెళ్లభరణి, గొల్లపూడి మారుతీరావు, సుద్దాల అశోక్ తేజ కూడా పాల్గొని తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి గురించి మాట్లాడుతారన్నారు. సదస్సులో మొత్తం 13 సెషన్స్ జరుగుతాయని, ఒక్కో సెషన్‌లో లబ్దప్రతిష్టులు మాట్లాడుతారని తెలిపారు. తెలుగు భాష మనందరిది, తెలుగువారంతా ఒక్కటేనని, మన ఐక్యతను చాటిచెప్పేందుకు ఈ సభలు దోహదపడతాయన్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ప్యారిస్, మారిషస్ నుంచి 12 మంది విదేశీ ప్రతినిధులు, పశ్చిమబంగా, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి 125 మంది ప్రతినిధులు వస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్షుడు విశ్వానాథ్ ప్రసాద్ తివారి, అన్ని ప్రతికల సంపాదకులు వస్తున్నారన్నారు. మూడో ప్రపంచ తెలుగురచయితల మహాసభలకు 1500 మంది రచయితలు ప్రతినిధులుగా పాల్గొని తెలుగు భాషా సాహిత్యాలపై తమ అభిప్రాయాలను ప్రకటించడం అభినందనీయమని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు మహాసభల్లో పాల్గొన్న తాను, మూడో మహాసభలకు స్వయంగా పాల్గొనలేకపోతున్నానని చెప్పారు




