విజయవాడ,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: మార్చినుంచి చౌకధరల దుకాణాల్లో ఈ పాస్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై అధికారులు చర్చించారు.తొలిదశలో జిల్లాలో 600 దుకాణాల్లో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కచ్ఛితమైన తూకం, ఇతర అక్రమాలు లేకుండా రేషను సరకుల పంపిణీకి దోహదపడే ఈ-పాస్ యంత్రం అనుసంధాన విధానాన్ని రాష్ట్రంలోని 29 వేల చౌక ధరల దుకాణాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తొలి దశలో ఆరు వేల దుకాణాల్లో ఏర్పాటు చేయనున్నట్టు పౌరసరఫరాల రాష్ట్ర కమిషనరు బి.రాజశేఖర్ తెలిపారు. బయోమెట్రిక్ విధానం, ఐరిస్ విధానాల ద్వారా నిజమైన లబ్దిదారుని వివరాలను తెలుసుకోవచ్చన్నారు. బియ్యం, పంచదార వంటి తూకాల్లో కూడా మోసాలు లేకుండా అరికట్టవచ్చన్నారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేసిన కలెక్టరును కమిషనర్ అభినందించారు.




