Wednesday, 4 November 2026

పట్టిసీమ పై వైకాపా రాజకీయం: టిడిపి

కడప,మార్చి26  (జ‌నంసాక్షి)  : పట్టిసీమ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈ పథకం తీసుకురావడం ఈప్రాంత రైతులకు వరమని పేర్కొన్నారు. గోదావరిలో వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఉపయోగించు కోవడం కోసమే పట్టిసీమ చేపడుతున్నారని అన్నారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురయ్యే అవకాశం లేదన్నారు. జులై నుంచి మూడు నెలల పాటు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో మిగులు జలాలను ఇక్కడి రైతులకు అందించాల్సి ఉంటుందన్నారు. కాలువ నిర్మాణం సకాలంలో పూర్తిచేస్తేనే పట్టిసీమ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే సీమకు నీరు రావడం వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదన్నారు. అదేపనిగా పట్టిసీమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీమకు సాగునీరొస్తే వైకాపా నేతల ఆగడాలకు బ్రేక్‌ పడుతుందనే భయంతో వారు అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు.  గోదావరి నీటిని కృష్ణాకు తరలించి అక్కడి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు నీరిస్తే శాశ్వత కరవు నివారణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వృధా నీటిని సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్న సీమకు తరలిస్తే వైకాపా నేతలకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *