విజయవాడ,మార్చి25 : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 286 పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 286 కేంద్రాలలో పరీక్షల కోసం ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్, ప్లెయింగ్ స్క్వాడ్ బృందాలకు మూడు వేల మందిని నియమించారు. విద్యార్థులు 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఏర్పాట్లపై ఎవ్యిూవోలు ఆయా కేంద్రాలను తనిఖీలు చేసి ఏర్పాట్లు పరిశీలించారు. పరీక్ష జరిగే ప్రతి గదిలో మంచినీటి కుండను ఏర్పాటు చేయడం, గదిలో సీలింగ్ ఫ్యాను, ట్యూబ్ లైటు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. దీంతో అటెండరు కూడా అందుబాటులో ఉండాలి. విద్యార్థులు తాగునీటి కోసం కూడా బయటకు రాకూడదు. అవనిగడ్డ మండలంలో 755 మంది ఐదు పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల, శ్రీచితన్య స్కూలు, జడ్పీహెచ్‌ఎస్, ఎస్‌కేఆర్‌ఎం. బాలికల ఉన్నత పాఠశాలలను కేంద్రాలగా ఎంపిక చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లను తనిఖీ చేశారు. బాలికోన్నత పాఠశాలలో ఐదు గదులలో ఫ్యాన్లు, లైటింగ్ వసతి లేకపోవడంతో వెంటనే ఏర్పాటు చేయాలని సూచించటంతో యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు.




