విశాఖపట్నం : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిరదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలుచోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు 1,2 డిగ్రీలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటిన వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఉండదన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.




