విశాఖపట్టణం,మార్చి3(జనంసాక్షి): విజయవాడలో ఆంద్రా బ్యాంక్ ఉద్యోగుల తరహాలోనే ఇప్పుడు విశాఖలో కూడా ఉద్యోగులు మొండి బకాయిల వసూళ్ల కోసం ఆందోళనకు దిగారు. విశాఖ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కారు. బ్యాంకుకు చెల్లించాల్సిన మొండి బకాయిలు కట్టమని అప్పులు తీసుకున్న వారి వద్దకు వెళ్లారు. విశాఖలో గతంలో నిర్మించిన వాంబే కాలనీలో ఇళ్లకోసం ఆంధ్రాబ్యాంకు 380 మందికి రూ.25 కోట్ల వరకు అప్పులు ఇచ్చింది. వీటిలో లబ్దిదారుల నుంచి సుమారు రూ. 15 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. చాలాకాలంగా ఈ సొమ్మును వీరు చెల్లించకపోవడంతో మా డబ్బు మాకు చెల్లించండి మహాప్రభో అంటూ లబ్దిదారుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. రుణాలు తీసుకుని కట్టకపోవడంతో తమ బ్యాంక్ దివాళా తీస్తుందని అన్నారు. రుణాలు ప్రజల సొమ్ము అని గుర్తించాలన్నారు.




