విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుపాను పెను తుపానుగా మారే అవకాశం లేదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం తెలిపింది. ఇది ప్రస్తుతం చెన్నైకి ఆగ్నెయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 36 గంటల వరకు వాయువ్య దిశగా కదులుతుందని అనంతరం దిశ మార్చకుని ఈశాన్యం వైపు కదిలి బంగ్లాదేశ్, మయన్మార్‌ల వైపు తరలిపోతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఇప్పుడే మన రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పోర్ట్‌బ్లెయిర్, నికోబార్ దీవుల పరిసర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు అటువైపు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.




